
ఇర్ఫాన్ పఠాన్(ఫైల్ ఫోటో)
అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం ఎప్పుడనేది తన దేశవాళీ మ్యాచ్ ల్లో ప్రదర్శనే చెబుతుందని ఇటీవల వ్యాఖ్యానించిన భారత వెటరన్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అందుకు తగినట్టే బంతితో మెరుపులు మెరిపించాడు.
వడోదర:అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం ఎప్పుడనేది తన దేశవాళీ మ్యాచ్ ల్లో ప్రదర్శనే చెబుతుందని ఇటీవల వ్యాఖ్యానించిన భారత వెటరన్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అందుకు తగినట్టే బంతితో మెరుపులు మెరిపించాడు. ముస్తాక్ అలీ ట్వంటీ 20 ట్రోఫీలో భాగంగా గ్రూప్-సిలో అస్సాంతో జరిగిన మ్యాచ్ లో ఇర్ఫాన్ ఐదు కీలక వికెట్టు తీసి బరోడా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 166 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన అస్సాంను ఇర్ఫాన్ తన పదునైన బంతులో కకావికలం చేశాడు.
తన కోటా నాలుగు ఓవర్లలో 13 పరుగుల మాత్రమే ఇచ్చిన ఇర్ఫాన్ .. అస్సాం టాపార్డర్ వెన్నువిరిచాడు. దీంతో అస్సాం తొలి ఐదు వికెట్లను 22 పరుగులకే కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కాగా, అటు తరువాత మిడిల్ ఆర్డర్ ఆటగాడు సయ్యద్ మహ్మద్(42) ఒక్కడే రాణించడంతో అస్సాం నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 116 పరుగులకు మాత్రమే పరిమితమై 49 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బరోడా ఆది నుంచి దూకుడుగా ఆడింది. బరోడా ఓపెనర్లలో కేదార్ దేవ్ దార్(48) రాణించగా, మున్రాల్ దేవ్ దార్(21) ఫర్వాలేదనిపించాడు. అనంతరం దీపక్ హుడా(48 నాటౌట్), చివర్లో స్వాప్నిల్ సింగ్(22) లు ఆకట్టుకోవడంతోబరోడా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.