
కగిసో రబడ ( ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా మళ్లీ అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 11 వికెట్లు పడగొట్టిన రబడ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో రబడ 902 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంకు చేరగా రవింద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
902 పాయింట్లు సాధించిన రబడ ఈ మార్క్‌ను అందుకున్న 23వ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇక దక్షిణాఫ్రికా నుంచి నాలుగో బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఫిలాండర్(2013లో 912 ), షాన్ పొలాక్( 1999లో 909), స్టెయిన్(2014లో 909) పాయింట్లతో తనకన్నా ముందు వరుసలో ఉన్నారు.
ఇక బ్యాటింగ్ విభాగంలో అంతగా మార్పులు చోటుచేసుకోలేదు. 943 పాయింట్లతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 912 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటీవల అద్భుత సెంచరీతో మెరిసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డివిలియర్స్ 5 స్థానాలు ఎగబాకి 778 పాయింట్లతో ఏడో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఇక జట్ల ర్యాంకుల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. తొలి రెండు స్థానాల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా మూడో స్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతోంది.