గంభీర్ సేనకు కల్లిస్ హెచ్చరిక!
కోల్కతా:కోల్కతా నైట్ రైడర్ప్.. ఐపీఎల్ -9వ సీజన్లో ఇప్పటివరకూ ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఆరు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఆ జట్టు ప్రధాన కోచ్ జాక్వస్ కల్లిస్ మాత్రం ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ప్రస్తుత పొజిషన్ను చూసి మురిసిపోవడం కంటే కొంత జాగురతతో ఉండాలని హిత బోధ చేశాడు. గత ఏడాది కూడా ఇదే స్థితిలోఉన్న జట్టు ఆకస్మికంగా వెనుకబడి పోయిన సంగతి ప్రతీ ఒక్క ఆటగాడు గుర్తించుకోవాలన్నాడు.
'జట్టు టాప్లో కొనసాగుతుండటం సంతోషించదగ్గ విషయమే. ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నాం. గతేడాది కూడా కోల్ కతా నైట్ రైడర్స్ ఆదిలో ఆకట్టుకుని ఆ తరువాత చతికిలబడింది. 2015లో ఈడెన్ గార్డెన్లో కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో కోల్ కతా ఒక పరుగు తేడాతో అద్భుత విజయాన్ని సాధించి పోల్ పొజిషన్ రేసులో నిలిచింది. అయితే ఆ తరువాత ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన వరుస మ్యాచ్ల్లో ఓటమి చెందాం. దాంతో ప్లే ఆఫ్ బెర్తును కోల్పోయి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడితే మంచిది'అని కల్లిస్ ఆటగాళ్లను హెచ్చరించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ పై కోల్ కతా ఏడు పరుగుల తేడాతో గెలిచిన అనంతరం ఆనాటి మ్యాచ్ ను కల్లిస్ జ్ఞప్తికి తెచ్చుకోవడం గమనార్హం.