రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో)
ముంబై : ఈ సీజన్ ఐపీఎల్‌లో వరుస ఓటములతో చతికిలపడ్డ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయాల బాట పట్టాలంటే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా రావాలని మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ ఓపెనర్‌గా వస్తే ముంబైకి మంచి శుభారంభం అందుతుందని, దీంతో భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుందని తెలిపాడు.
‘‘రోహిత్ విజయవంతమైన ఓపెనర్, భారత్ ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. కావునా అతను స్వేచ్ఛగా ఆడేందుకు ఓపెనర్‌గా రావడం అతనికి చాలా ముఖ్యం. రోహిత్ శుభారంభాన్నందిస్తే జట్టు భారీ స్కోర్ చేయగలదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ వస్తే.. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయి పరిస్థితి కఠినంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో రోహిత్ స్వేచ్ఛగా ఆడలేడు.’’ అని ఈ మాజీ ముంబై ఓపెనర్ పేర్కొన్నాడు.
అఫ్గనిస్తాన్ మాజీ కోచ్ అయిన రాజ్‌పుత్.. ముంబై విజయాల కోసం జట్టులో మరో మార్పు చేయాలని సూచించాడు. ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పోలార్డ్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు జేపీ డుమిని తీసుకోవాలని సలహా ఇచ్చాడు. ‘పొలార్డ్ మంచి ఫామ్‌లో లేడు. అతను పరుగుల కోసం తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ముంబై అతని స్థానంలో జేపీ డుమినీని తీసుకోవడం ఉత్తమం’ అని అభిప్రాయపడ్డాడు. ఇక గత ఐదు మ్యాచ్‌ల్లో పోలార్డ్ అత్యధిక స్కోర్ 28 పరుగులు మాత్రమే. ఇక శనివారం పుణె వేదికగా ముంబై బలవంతమైన చెన్నైతో తలపడునుంది. ఈ జట్ల మధ్య ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ జరగగా.. హోరాహోరి సాగిన పోరులో చివరకు విజయం చెన్నైనే వరించింది.
Comments
Please login to add a commentAdd a comment