
మెక్సికో అలవోకగా...
నాకౌట్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మెక్సికో ఆటగాళ్లు చెలరేగారు. ద్వితీయార్ధంలో పది నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ సాధించారు.
క్రొయేషియాపై 3-1తో విజయం
రెసిఫే: నాకౌట్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మెక్సికో ఆటగాళ్లు చెలరేగారు. ద్వితీయార్ధంలో పది నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ సాధించారు. గూప్ ‘ఎ’లో భాగంగా సోమవారం అర్ధరాత్రి క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో 3-1తో నెగ్గింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
బెజిల్‌తో సమానంగా ఏడు పాయింట్లు సాధించినప్పటికీ గోల్స్ తేడాతో వెనుకబడింది. ప్రిక్వార్టర్స్‌లో మెక్సికో జట్టు పటిష్ట నెదర్లాండ్స్‌ను ఎదుర్కోనుంది. కెప్టెన్ మార్కెజ్, గార్డరో, హెర్నాండెజ్ మెక్సికో తరఫున గోల్స్ చేశారు. క్రొయేషియా చేసిన ఏకైక గోల్‌ను పెరిసిక్ సాధించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మార్కెజ్‌కు దక్కింది.
మెక్సికోను ప్రథమార్ధంలో క్రొయేషియా బాగానే నిలువరించింది. 16వ నిమిషంలో మెక్సికో మిడ్‌ఫీల్డర్ హెరేరా లాంగ్ షాట్ గోల్ బంతిని గోల్ కీపర్ పట్టుకున్నాడు.
అటు క్రొయేషియా కూడా కొన్ని అద్భుత క్రాస్‌లతో గోల్స్ కోసం ప్రయత్నించినా మెక్సికో కీపర్ ఒచోవా ఎప్పటిలాగే అడ్డుగోడలా నిలిచాడు. దీంతో ప్రథమార్ధం గోల్స్ లేకుండానే ముగిసింది.
అయితే ద్వితీయార్ధం చివర్లో దూకుడు పెంచిన మెక్సికో స్వల్ప వ్యవధిలోనే మూడు గోల్స్ చేసి సత్తా చాటింది. 72వ నిమిషంలో హెరేరా కార్నర్ కిక్‌ను డిఫెండర్ మార్కెజ్ గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
75వ నిమిషంలో పెరాల్టా పాస్‌ను గెరార్డో లక్ష్యానికి చేర్చి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. 82వ నిమిషంలో గెరార్డో కార్నర్‌ను మార్కెజ్ నుంచి అందుకున్న హెర్నాండెజ్ గోల్ చేసి 3-0 ఆధిక్యాన్ని అందించాడు.అయితే 87వ నిమిషంలో క్రొయేషియాకు పెరిసిక్ గోల్ అందించాడు.