
రెండో వన్డేలో మైకేల్ క్లార్క్!
ఇది ఒకింత ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. అంతర్జాతీయ క్రికెట్ కు గతేడాది వీడ్కోలు పలికిన వ్యక్తి ఆకస్మికంగా మళ్లీ జట్టులోకి రావడమేమిటనేది సగటు క్రికెట్ అభిమానిని నిజంగా ఆలోనలో పడేసే విషయమే.
బ్రిస్బేన్: ఇది ఒకింత ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. అంతర్జాతీయ క్రికెట్ కు గతేడాది వీడ్కోలు పలికిన వ్యక్తి ఆకస్మికంగా మళ్లీ జట్టులోకి రావడమేమిటనేది సగటు క్రికెట్ అభిమానిని నిజంగా ఆలోనలో పడేసే విషయమే. క్లార్క్ మళ్లీ చడీ చప్పుడు కాకుండా ఆసీస్ కు ఆడుతున్నాడా? అనే అనుమానాన్ని రేకెత్తించారు బ్రిస్బేన్ స్కోరు బోర్డు నిర్వాహకులు.
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియాతో శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో క్లార్క్ పేరు ప్రధాన స్కోరు బోర్డుపై ప్రత్యక్షమైంది. టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ దిగిన సమయంలో ఇరు జట్ల ఆటగాళ్ల పేర్లను స్టేడియంలో ఉన్న స్క్రీన్ పై చూపించిన క్రమంలో క్లార్క్ పేరు కనబడింది. అయితే దీన్ని చూసిన ప్రేక్షకులు తొలుత కాస్త ఆలోచనలో పడ్డారు. ఇది సాంకేతిక తప్పిదం వల్ల చోటు చేసుకుందని గ్రహించి కాసేపు నవ్వుకున్నారు. కాగా, దీనిపై మైకేల్ క్లార్క్ తనదైన శైలిలో స్పందించాడు. ఇంకా నన్ను గబ్బా ఇంకా ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు. మళ్లీ క్రికెట్ జీవితంలోకి వచ్చే ఆలోచన లేదని ఈ సందర్భంగా క్లార్క్ పేర్కొన్నాడు.