ఆ విషయంలో వేరే ఆప్షనే లేదు : కేంద్ర మంత్రి
ఒలింపిక్స్లో పాల్గొననున్న ఆటగాళ్ల స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేది లేదని క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టంచేశారు. యాంటీ డోపింగ్ ప్యానెల్ నిషేధించిన ఆటగాళ్ల స్థానంలో వేరొకరికి చాన్స్ ఇవ్వడం లాంటివి ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. రియోకు అర్హత సాధించిన ఓ ప్లేయర్ ఎవరైనా డోపింగ్ టెస్టులో విఫలమైతే ఈ విషయంలో వేరే ఆప్షన్ ఉండదని మంత్రి గోయల్ పేర్కొన్నారు.
ఒకవేళ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ప్లేయర్ తీవ్ర అస్వస్థతకు లోనైన ప్రత్యేక సందర్భాలలో మాత్రమే రీప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తారని చెప్పారు. ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని ఇతర ఆటగాడిని రియోకు పంపిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలపారు. మరోవైపు నర్సింగ్ యాదవ్ స్థానంలో పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో భారత్ నుంచి ప్రవీణ్ రాణా బరిలోకి దిగనున్నాడని ప్రచారంలో ఉంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు ఈ విషయంపై సమాచారం అందించింది.