ఐసీసీ ఇచ్చే రుణం అక్కర్లేదు: పీసీబీ
కరాచీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంజూరు చేసిన రుణాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తిరస్కరించింది. తమకు రుణాన్ని ఇస్తామంటూ ఐసీసీ ముందుకొచ్చిన విషయాన్ని పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చీఫ్ నథీమ్ సేథీ వెల్లడించారు. తాము ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వమని మాత్రమే ఐసీసీని అడిగిన విషయాన్ని సేథీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
'మాకు ఐసీసీ రుణాన్ని ఆఫర్ చేసింది. మేము ఎప్పుడూ ఐసీసీ నుంచి చేబదులు కానీ, రుణాల్నికానీ కోరలేదు. ఒక ప్రత్యేక ఫండ్ మాత్రమే ఇవ్వమని ఐసీసీని అడిగాం. అది కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మాతో ద్వైపాక్షిక సిరీస్ కు అంగీకరించే వరకే అనే విషయాన్ని తెలిపాం. 2007 నుంచి మా దేశంలో ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్ జరగనందున చాలా నష్టపోయాం. ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఐసీసీ ఆదుకోవాలి. అది మా హక్కు కూడా. కొంతవరకూ రుణాన్ని ఇస్తామంటే అది మాకు వద్దు' అని సేథీ లాహోర్లో మీడియాకు తెలిపారు.