కరాచీ: భారత క్రికెట్ జట్టును చూసి తమ క్రికెట్ జట్టు నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. ప్రధానంగా భయంలేని క్రికెట్‌ను ఆడితేనే సత్పలితాలు వస్తాయన్నాడు. ఇక్కడ విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియాను పాకిస్తాన్ అనుసరించాల్సిన అవసరం ఉందన్నాడు. పాక్ ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్, కెప్టెన్ అజహర్ అలీలు జట్టును మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఫోకస్ చేయాలన్నాడు. ‘ భారత క్రికెట్ జట్టు ఎలా పటిష్టంగా మారిందో నేను చూశా. వారు దూకుడుగా క్రికెట్ ఆడుతూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గతంలో పాకిస్తాన్ కూడా దూకుడుకు మారుపేరు. ఇప్పుడు మన పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.(ఇక్కడ చదవండి:ఆసీస్ వన్డే కెప్టెన్‌గా ధోని)
పోరాడాలనే కసిని అలవర్చుకున్న క్రమంలోనే మనం అనుకున్నది సాధించవచ్చు. ఇక్కడ మన కెప్టెన్ అజహర్ అలీని భారత్ కెప్టెన్ కోహ్లితో పోల్చి చూడండి. కోహ్లి ఎలా జట్టును ముందుండి నడిపిస్తున్నాడో చూడండి. మనం కూడా కోహ్లిని ఫాలోకాక తప్పదు. పాకిస్తాన్ జట్టు మెరుగుపడాలంటే టీమిండియా జట్టును ఉదాహరణగా తీసుకోండి. దీనిపై మిస్బావుల్ హక్-అజహర్ అలీ పూర్తి స్థాయిలో దృష్టి నిలపాలి. మన రోడ్ మ్యాప్ కోహ్లి అండ్ గ్యాంగ్ కంటే మెరుగ్గా ఉండాలి. విరాట్ కోహ్లి ఫిట్‌నెస్‌ను ఆ జట్టు మొత్తం అనుసరిస్తోంది. ఒక కెప్టెన్‌గా ప్రత్యేక ముద్ర అవసరం.(ఇక్కడ చదవండి: పాకిస్తాన్‌కు ఝలక్ ఇచ్చిన బంగ్లా)
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు చాలా దూకుడుగా ఉండేది. అతను గ్రౌండ్‌లోకి వచ్చాడంటే ఎవరి మాటా వినేవాడు కాదు. ఫీల్డ్‌లో సుమారు 10 ల్యాప్‌ల పరుగును ఇమ్రాన్ పూర్తి చేసేవాడు. నెట్స్‌లో కనీసం మూడు గంటలు శ్రమించేవాడు ’ అని అక్తర్ పేర్కొన్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ను పాకిస్తాన్ 1-0తో కైవసం చేసుకుంది. పదేళ్ల తర్వాత స్వదేశంలో ఒక టెస్టు సిరీస్ జరగ్గా, అందులో పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఆకట్టుకుని సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే స్వదేశంలో పాకిస్తాన్ సాధించిన విజయాన్ని పరిగణలోకి తీసుకోకుండా విదేశాల్లో పటిష్టమైన జట్లపై ఏ విధంగా ఆడాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అక్తర్ సూచించాడు. ఇక్కడ భారత క్రికెట్ జట్టును ఒక ఉదాహరణగా తీసుకోవాలని అక్తర్ తెలిపాడు.(ఇక్కడ చదవండి: నసీమ్ షా సరికొత్త రికార్డు)
Comments
Please login to add a commentAdd a comment