
బెంగళూరు: కొన్నాళ్లుగా చక్కగా రాణిస్తున్న యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు మరో అవకాశం. వచ్చే నెల 14 నుంచి అఫ్గానిస్తాన్‌తో ఇక్కడ జరగనున్న చారిత్రక టెస్టుకు అతడు భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి జూన్ నెల మొత్తం ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడనుండటంతో అతని స్థానంలో శ్రేయస్‌కు చోటు దాదాపు ఖాయమైంది. ఈ మేరకు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్టర్లు మంగళవారం బెంగళూరులో జట్టును ఎంపిక చేయనున్నారు. తుది జట్టులో స్థానం దక్కితే శ్రేయస్‌కు ఇదే తొలి టెస్టు అవుతుంది. ఇప్పటివరకు 46 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన అతడు... 53.90 సగటుతో 3,989 పరుగులు చేశాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించనున్నారు. రహానే గతేడాది ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులోనూ కెప్టెన్‌గా చేశాడు. మరోవైపు ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్న చటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ సహా మిగతా రెగ్యులర్ ఆటగాళ్లంతా అఫ్గాన్‌తో టెస్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఈ మ్యాచ్‌తోనే అఫ్గాన్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయనుండటం విశేషం.
రాయుడొస్తున్నాడు!
కౌంటీల కారణంగా విరాట్ ఐర్లాండ్‌తో రెండు టి20ల సిరీస్‌కూ దూరంగా ఉండనున్నాడు. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపడతాడు. నిదహాస్ ట్రోఫీ గెలిచిన జట్టునే దాదాపుగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తున్నా, ఈ ఐపీఎల్‌లో అదరగొడుతున్న హైదరా బాద్ సీనియర్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు పేరు కూడా చర్చకు రానున్నట్లు సమాచారం.
‘ఎ’ జట్టులో పృథ్వీ, శుబ్‌మన్, మావి
యువ సంచలనాలు పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్, శివం మావి ఇంగ్లండ్‌లో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌కు భారత జట్టుకు ఎంపిక కానున్నారు. ఈ సిరీస్‌లో మూడో జట్టుగా వెస్టిండీస్ ‘ఎ’ బరిలో దిగనుంది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తాడు. పర్యటనలో భాగంగా భారత్ ‘ఎ’ జట్టు జులై 16–19 మధ్య ఇంగ్లండ్ లయన్స్ (ఎ జట్టు)తో నాలుగు రోజుల టెస్టు ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment