బాసెల్ (స్విట్జర్లాండ్): సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పదోసారి స్విస్ ఇండోర్స్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)తో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6–2, 6–2తో గెలిచాడు. తాజా విజయంతో ఫెడరర్ కెరీర్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్య 103కు చేరింది. జిమ్మీ కానర్స్ (అమెరికా–109 టైటిల్స్) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేయడానికి ఫెడరర్ మరో ఆరు టైటిల్స్ దూరంలో ఉన్నాడు. రాకెట్ పట్టిన తొలినాళ్లలో ఈ టోర్నీలో ‘బాల్ బాయ్’గా పనిచేసిన ఫెడరర్ టైటిల్ గెలిచిన ప్రతీసారి ఈ టోర్నీలో బాల్ బాయ్స్, బాల్ గర్ల్స్‌గా వ్యవహరించిన వారందరికీ పిజ్జాలు కానుకగా ఇస్తాడు. వారితో కలిసి తింటాడు.
ఈ టోర్నీలో 15వ సారి ఫైనల్ చేరిన ఫెడరర్‌కు తుది పోరులో ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. 68 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో 38 ఏళ్ల ఫెడరర్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 4,30,125 యూరోలు (రూ. 3 కోట్ల 37 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో ఫెడరర్ 2006, 2007, 2008, 2010, 2011, 2014, 2015, 2017, 2018 ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. స్విస్ ఇండోర్స్‌లో టైటిల్ నెగ్గిన ఫెడరర్ వచ్చే సీజన్ కోసం ఫిట్‌గా ఉండేందుకు సోమవారం మొదలైన పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment