సచిన్ నుంచి స్ఫూర్తి పొందాను
ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి తాను స్ఫూర్తి పొందానని భారత మహిళా రెజ్లర్ వినేష్ పొగట్ చెబుతోంది. రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన వినేష్.. ఇటీవల సచిన్తో కలసి మాట్లాడినట్టు చెప్పింది. 'సచిన్ సుదీర్ఘకాలం విజయవంతమైన కెరీర్ కొనసాగించాడు. తప్పుల నుంచి ఎలా పాఠాలు నేర్చుకున్నాడో సచిన్ వివరించాడు. మాస్టర్ నుంచి నేనెంతో స్ఫూర్తిపొందా' అని వినేష్ చెప్పింది.
ఈ ఏడాది జరిగే రియో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని ఈ 21 ఏళ్ల ఫ్రీస్టయిల్ రెజ్లర్ ధీమా వ్యక్తం చేసింది. ఈ మెగా ఈవెంట్లో భారత అథ్లెట్లు మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్లో క్రికెట్ ఇతర క్రీడలను డామినేట్ చేస్తున్నా, కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోందని చెప్పింది. క్రికెట్తో పోలిస్తే దేశంలో రెజ్లింగ్కు అంత ఆదరణ లేకపోయినా, రెజ్లింగ్ దిగ్గజం సుశీల్ కుమార్ అంటే చాలామందికి తెలుసునని అంది. రియో ఒలింపిక్స్లో బెర్తు సాధించేందుకు వినేష్ కఠోర సాధన చేసింది. ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయడంతో పాటు 6 కిలోల బరువు తగ్గింది. ప్రస్తుతం ఆమె లక్నోలో శిక్షణ పొందుతోంది.