భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీ జట్టు
సాక్షి, హైదరాబాద్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్) తెలంగాణ రీజియన్ క్రికెట్ టోర్నమెంట్ జూనియర్ విభాగంలో భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీ (సైనిక్‌పురి), సీనియర్ విభాగంలో సర్దార్ పటేల్ (ఎస్‌పీ) డిగ్రీ కాలేజీ (సికింద్రాబాద్, పద్మారావునగర్) జట్లు విజేతలుగా నిలిచాయి. ‘సాక్షి’ మీడియా గ్రూప్, శ్రీ చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీ గురువారం ముగిసింది. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్‌ఆర్‌ఐటీ) మైదానంలో జరిగిన జూనియర్ విభాగం ఫైనల్లో భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీ ఎనిమిది వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌ఆర్ జూనియర్ కాలేజీ (మంచిర్యాల) జట్టుపై ఘనవిజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ జట్టు 20 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌటైంది. సాయి (22), ఆసిఫ్ (15), వికాస్ (15) రాణించారు. భవన్స్ జట్టు బౌలర్లలో ఇలియాన్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా... మయాంక్, రాహుల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం భవన్స్ 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పో యి 78 పరుగులు చేసి గెలిచింది. భవన్స్ జట్టులో సాకేత్ (43; 7 ఫోర్లు), ఇలియాన్ (12) ఆకట్టుకున్నారు. ఎస్‌ఆర్‌ఆర్ బౌలర్ సాయి కృష్ణ రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఇలియాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది.
సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజీ జట్టు
సీనియర్స్ విభాగం ఫైనల్లో సర్దార్ పటేల్ కాలేజీ 47 పరుగుల ఆధిక్యంతో ఆదర్శ్ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. తొలుత సర్దార్ పటేల్ కాలేజీ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లకు 162 పరుగులు సాధించింది. షేక్ సోహైల్ (55), రాకేశ్ (43) రాణించారు. అనంతరం ఆదర్శ్ కాలేజీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసి ఓడిపోయింది. షేక్ సోహైల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ పురస్కారం దక్కింది. జూనియర్, సీనియర్ విభాగంలో విజేతగా నిలిచిన భవన్స్, సర్దార్ పటేల్ కాలేజీ జట్లకు రూ. 50 వేలు చొప్పున... రన్నరప్ ఎస్‌ఆర్‌ఆర్, ఆదర్శ్ డిగ్రీ కాలేజీ జట్లకు రూ. 25 వేలు చొప్పున ప్రైజ్‌మనీ అందజేశారు.
‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన సాకేత్ (భవన్స్ శ్రీ అరబిందో), రాకేశ్ (సర్దార్ పటేల్ కాలేజీ)లకు రూ. 15 వేలు చొప్పున... ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్స్’గా నిలిచిన ఇలియాన్ (భవన్స్), షేక్ సోహైల్ (సర్దార్ పటేల్)లకు రూ. 10 వేలు చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. సైనిక్‌పురిలోని భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్లు రాణి రెడ్డి (కార్పొరేట్ ఎఫైర్స్), ఏఎల్‌ఎన్ రెడ్డి (బిజినెస్ కంట్రోల్), భవన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ కమోడోర్ (రిటైర్డ్) జేఎల్‌ఎన్ శాస్త్రి, శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ ఏజీఎం డి.వెంకటేశ్వర్లు డీన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు, చెక్‌లు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment