
ఫిట్... ఫిట్... హుర్రే!
టెన్నిస్ మ్యాచ్‌లో ఫలితం కోసం చివరి సెట్ ఆడాల్సి వస్తే... ఆ మ్యాచ్ ఆడేది జొకోవిచ్‌గానీ, సెరెనా గానీ అయితే ఫలితం గురించి పెద్దగా ఆలోచించాల్సిన...
ఈసారి వింబుల్డన్‌లో సెరెనా, జొకోవిచ్ ఇద్దరూ పవర్ గేమ్‌తో టైటిల్స్ సాధించారు. సెరెనా మీద గెలవాలంటే జొకోవిచ్ ఆడాలేమో అనే స్థాయిలో ఈ అమెరికా నల్లకలువ చెలరేగితే... జొకోవిచ్‌కు పోటీ ఇవ్వగల వారు ఉన్నారా అనే సందేహం ఈ సెర్బియా స్టార్ కలిగించాడు. మొత్తం మీద ప్రస్తుత టెన్నిస్‌లో అత్యంత ఫిట్‌గా ఉండే ఇద్దరు క్రీడాకారులు టైటిల్స్ గెలిచి ఫిట్‌నెస్ పవర్ చూపించారు.
సాక్షి క్రీడావిభాగం: టెన్నిస్ మ్యాచ్‌లో ఫలితం కోసం చివరి సెట్ ఆడాల్సి వస్తే... ఆ మ్యాచ్ ఆడేది జొకోవిచ్‌గానీ, సెరెనా గానీ అయితే ఫలితం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. సాధారణంగా చివరి సెట్‌లో గెలవాలంటే అద్భుతమైన ఫిట్‌నెస్ ఉండాలి. తొలి సెట్‌లో తొలి సర్వీస్‌కు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చివరి సెట్‌లోనూ అలా ఆడగలగాలి. ప్రస్తుత టెన్నిస్‌లో వీళ్లిద్దరూ అలాంటి సమర్థులు. అందుకే తమ పవర్‌తో మరోసారి ఆకట్టుకున్నారు.
ఫిట్‌నెస్ కోసం సెరెనా నృత్యం
ఆధునిక శకంలో అత్యంత పెద్ద వయసులో టైటిల్ గెలిచిన మహిళగా సెరెనా విలియమ్స్ ఈసారి రికార్డు సృష్టించింది. 33 ఏళ్ల 289 రోజుల వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడం అంటే ఎంత ఫిట్‌నెస్ కావాలి? మరి సెరెనా ఫిట్‌నెస్ కోసం ఏం చేస్తుంది? తాజాగా ఆమె ఓ కొత్త విషయం చెప్పింది. ఒక వినూత్నమైన డ్యాన్స్‌తో తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటోంది. దీనిని ఆమె ‘సెరెనా ప్లాన్’గా అభివర్ణించింది. ‘దానిని ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు.
డ్యాన్స్ చేస్తాను. అందులో ఏ మాత్రం వేగం ఉండదు. అలా అని మరీ నెమ్మదిగానూ ఉండదు. అందులో చాలా మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఫ్లోర్ మీద కూడా కొంత డ్యాన్స్ ఉంటుంది’ అని సెరెనా చెప్పింది. అథ్లెట్లు ఫిట్‌నెస్ విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలి. మారుతున్న టెక్నాలజీని వినియోగించుకుని కొత్త వర్కవుట్స్ చేయాలి.
గతంతో పోలిస్తే తాను ఇప్పుడు మరింత ఫిట్‌గా ఉన్నానని, ఏమాత్రం వయసు తెలియడం లేదని సెరెనా చెబుతోంది. ‘నాకు కూడా కొన్ని నొప్పులు, గాయాలు ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా ఉన్నాను. ఫిట్‌నెస్ కోసం 10, 12 ఏళ్ల క్రితం ఏం చేశానో దానికంటే ఇప్పుడు మరింత ఎక్కువ కష్టపడుతున్నాను. టెన్నిస్ లాంటి క్రీడ విషయంలో ఫిట్‌నెస్ ఆవశ్యకత గురించి కొత్తగా చెప్పాల్సిందేముంది’ అని సెరెనా పేర్కొంది.
రాజీ పడని సెర్బియా స్టార్
పురుషుల విభాగం ఫైనల్ చూసిన ఎవరికైనా జొకోవిచ్ ఫిట్‌నెస్ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమై ఉంటుంది. కోర్టులో బంతి ఏ మూల పడ్డా దానిని చేరుకున్నాడు. తొలి సెట్ టైబ్రేక్‌లోని తొలి పాయింట్ కోసం నెట్ దగ్గర బంతిని అందుకోవడానికి అమాంతం పరిగెత్తి దానిని ఫెడరర్‌కు అందకుండా పంపిన తీరు అమోఘం. చిన్నప్పటి నుంచి కూడా జొకోవిచ్ ఏంతిన్నా పెద్దగా లావు అయ్యేవాడు కాద ట. సీరియస్‌గా టెన్నిస్ ఆడటం ప్రారంభించాక ఫిట్‌నెస్ మీ ద శ్రద్ధ పెట్టినా... ఇప్పటికీ ఏవైనా తినాలని అనిపిస్తే వదలడట.
జొకోవిచ్ ట్రైనింగ్‌లో ఎక్కువ శాతం అప్పర్ బాడీ మీద శ్రద్ధ పెడతాడు. బెసైప్స్, చెస్ట్, షోల్డర్స్ మీద ఎక్కువ వర్కవుట్స్ చేస్తాడు. ఇక తిండి విషయంలో మిగిలిన వాళ్ల తరహాలో బాగా స్ట్రిక్ట్‌గా ఉండడు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా పళ్లు, గుడ్లు వాడతాడు. లంచ్‌లో హామ్‌బర్గర్‌కే టాప్ ప్రయారిటీ. డిన్నర్‌లో బ్రౌన్ రైస్, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటాడు. జొకోవిచ్ మెనూలో చీజ్, ఆయిల్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయినా తను మాత్రం ఫిట్‌గానే ఉంటాడు. దీనికి కారణం ప్రణాళిక ప్రకారం వర్కవుట్స్ చేయడం.
‘మనం ఫిట్‌గా ఉండటం ఎంత అవసరమో కోరికలు చంపుకోకుండా తినడం కూడా అంతే ముఖ్యం. అయితే మనం ఏం తింటున్నాం? ఎన్ని కేలరీలు వస్తున్నాయి? వాటిని ఎలా ఖ ర్చు చేయాలి అనే విషయంలో అవగాహన ఉండటం చాలా అవసరం. ఈ విషయంలో నా టీమ్ బాగా సహాయం చేస్తుం టుంది’ అని జొకోవిచ్ తెలిపాడు.
పార్టీలో డ్యాన్స్
ఆదివారం జొకోవిచ్ వివాహ వార్షికోత్సవం. వింబుల్డన్ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత రాత్రికి భార్య జెలెనాతో పాటు కోచ్ బోరిస్ బెకర్ ఇతర సిబ్బందితో సహా పార్టీకి వెళ్లాడు. పొడవాటి క్రీమ్ కలర్ గౌన్ ధరించిన సెరెనా తన బాయ్‌ఫ్రెండ్, కోచ్ ప్యాట్రిక్‌తో కలిసి పార్టీకి వచ్చింది. వింబుల్డన్ విజేతల కోసం ఏర్పాటు చేసే ఈ పార్టీలో ఈసారి జొకోవిచ్, సెరెనా కలిసి డ్యాన్స్ చేశారు.