మహిళల టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం కాకుండా ఈ టోర్నీ ద్వారా భారత జట్టుకు జరిగిన మరో మేలు ఒక సంచలన బ్యాటర్ వెలుగులోకి రావడం. 16 ఏళ్ల వయసులోనే దాదాపుగా ప్రపంచకప్‌ను గెలిపించాల్సిన పెను భారాన్ని ఆ అమ్మాయి మోసింది. దురదృష్టవశాత్తూ టైటిల్ నెగ్గకపోయినా మన మహిళల క్రికెట్ భవిష్యత్ భద్రంగా ఉందన్న ధైర్యం కలిగిందంటే ఆమె ఇచ్చిన ప్రదర్శనే కారణం. ఇదంతా హరియాణా టీనేజర్ షఫాలీ వర్మ గురించే. తన దూకుడైన ఆటతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆమె కూడా మున్ముందు మరింతగా దూసుకుపోవాలని పట్టుదలగా ఉంది.
సాక్షి క్రీడా విభాగం: టి20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 158.25 స్ట్రయిక్ రేట్‌తో 163 పరుగులు చేసింది. ఫైనల్లో షఫాలీ వైఫల్యం భారత జట్టు తుది ఫలితంపై బలంగా పడిందంటే టోర్నీలో ఆమె ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఐపీఎల్ సమయంలో జరిగిన ఉమెన్ చాంపియన్స్ టి20 టోర్నీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షఫాలీ ఏడాది తిరిగేలోగా భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది. రాబోయే రోజుల్లోనూ తన సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్న షఫాలీ తన కెరీర్‌కు సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే....
ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌పై...
నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ దాకా చేరడం సంతోషకరమే అయినా మున్ముందు కఠిన పరీక్షా సమయం ఉంది. అయితే నాకు ఎదురయ్యే ఎలాంటి సవాల్‌కైనా సిద్ధంగా ఉన్నా. రాబోయే రోజుల్లో భారత జట్టు ఎక్కువ మ్యాచ్‌లు గెలిచేలా ప్రయత్నించడం, వాటిలో నేనూ కీలక పాత్ర పోషించడమే ప్రస్తుతానికి నా దృష్టిలో లక్ష్యాలు.
వరల్డ్‌కప్ ఫైనల్ ఫలితంపై...
ఆ రోజు మాకు కలిసి రాలేదు. క్రీడల్లో గెలుపోటములు సహజమే. మేం ఒడిసిపట్టుకొని విజయాన్ని అందుకొనే మరిన్ని అవకాశాలు మున్ముందు వస్తాయి. ఫలితం వచ్చేశాక దానిని మనం మార్చలేం కానీ భవిష్యత్‌లో ఏం చేయాలో మా చేతుల్లోనే ఉంది.
తన వ్యక్తిగత ప్రదర్శనపై...
క్రీజ్‌లోకి అడుగు పెట్టాక వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి భారత జట్టును మెరుగైన స్థితిలో నిలపడమే నా బాధ్యత. ఎందరో ప్రముఖులు నా ప్రదర్శనను ప్రశంసించినప్పుడు గర్వంగా అనిపిస్తుంది. అయితే ట్రోఫీ గెలిచి ఉంటే ఇది మరింత అద్భుతంగా ఉండేది.
జట్టులో వాతావరణంపై...
చాలా బాగుంటుంది. సీనియర్లే మాట్లాడాలని, జూనియర్లు వారు చెప్పింది వినాలని అస్సలు ఉండదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతిలాంటి సీనియర్లయితే నన్ను మరింతగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇక డబ్ల్యూవీ రామన్ సర్ రూపంలో అద్భుతమైన కోచ్ మాకు ఉన్నారు. ఎలాంటి సమస్య గురించి చెప్పినా ఆయన దగ్గర పరిష్కారం ఉంటుంది. తన మార్గనిర్దేశనంతో మనలో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపగలరు.
స్మృతితో ఓపెనింగ్‌పై...
మేం అతిగా ఆలోచించం. ఇద్దరం సహజసిద్ధమైన ఆటనే ఆడేందుకు ప్రయత్నిస్తాం. కాస్త తేలికైన బంతి పడిందంటే చాలు చితక్కొట్టడమే. దానిపై మరో ఆలోచన లేదు. ఈ విషయంలో ఇద్దరం ఒకే తరహాలో ఆలోచిస్తాం. ఇక మంచి బంతులు వస్తే సింగిల్స్‌పై దృష్టి పెడతాం. సహజసిద్ధమైన ఆటను ఆడటంలో ఉండే సౌకర్యం మరోదాంట్లో రాదు. దానిని మార్చాలని ప్రయత్నిస్తే అది పని చేయదని నా నమ్మకం.
కరోనాతో వచ్చిన విరామంపై...
నా ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాను. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండటం కూడా ఎంతో కీలకం. దీనికి సంబంధించి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ నాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇక ఒక స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీతో ఒప్పందం కుదరడం వల్ల ఆర్థికపరంగా నేను ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండగలుగుతున్నా. ఎన్నో కష్టాలకోర్చి నేను ఈ స్థాయికి చేరడానికి కారణమైన మా నాన్నపై కూడా ఇప్పుడు ఆ భారం తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment