టెస్టులకు గుడ్‌బై?
ఏదో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోనున్న డివిలియర్స్
డర్బన్: అన్ని ఫార్మాట్లలోనూ అత్యంత నిలకడగా ఆడే దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ త్వరలోనే టెస్టులకు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్ తనకు చివరి టెస్టు సిరీస్ కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నందున డివిలియర్స్‌పై పనిభారం పెరిగిందని, ఇలాగే ఆడితే ఎక్కువకాలం ఆటలో కొనసాగలేడనే చర్చ చాలాకాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్‌లో జరుగుతూ ఉంది.
ఇటీవల జట్టు మేనేజ్‌మెంట్ కూడా ఏదో ఒక ఫార్మాట్‌ను వదులుకోమని డివిలియర్స్‌కు సలహా ఇచ్చినట్లు సమాచారం. ‘మూడేళ్లుగా నా గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు నన్ను నేను తాజాగా ఉంచుకుంటూ క్రికెట్‌లో కొనసాగుతున్నాను. ఆటను ఆస్వాదించడం ముఖ్యం.
ప్రస్తుతం ఉన్న షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుంటే అన్ని ఫార్మాట్లలోనూ కొనసాగడం కష్టం’ అని డివిలియర్స్ చెప్పాడు. దీంతో టెస్టులకు వీడ్కోలు పలుకుతాడనే భావన పెరిగింది. ప్రస్తుతం టి20ల్లో ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా అతను బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆదాయం పరంగా చూస్తే ఐపీఎల్ లాంటి టోర్నీని వదులుకోలేడు.