
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకాలు గెలుచుకున్న భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో వారిని నగదు పురస్కారంతో ప్రోత్సహించింది. స్వర్ణం గెలిచిన ఆటగాళ్లకు రూ.30 లక్షలు చొప్పున లభించగా... రజతానికి రూ. 20 లక్షలు, కాంస్యానికి రూ.10 లక్షల చొప్పున అందజేశారు. 2018 ఆసియా క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలు కలిపి మొత్తం 69 పతకాలు గెలుచుకున్నది.
క్రీడల చరిత్రలో ఇది మన దేశానికి అత్యుత్తమ ప్రదర్శన. సన్మాన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా... క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు కూడా పాల్గొన్నారు. ‘మన ఆటగాళ్ల ప్రదర్శన చాలా సంతోషాన్ని కలిగించింది. భవిష్యత్తులో భారత్ క్రీడల్లో కూడా సూపర్ పవర్‌గా ఎదుగుతుంది. విజేతలకు నా అభినందంతో పాటు ఆశీర్వాదాలు. క్రీడల పట్ల మంత్రి రాథోడ్‌కు ఉన్న అంకితభావం వెలకట్టలేనిది. ఇది భారతీయులందరికీ గర్వకారణం’ అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.