
విరాట్ కోహ్లి
ఛేదనలో మొనగాడైన విరాట్ కోహ్లి డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై చక్కటి విజయాన్ని అందించాడు. అయితే ఇది కనిపించినంత సునాయాస లక్ష్యం ఏమీ కాదు. చివరి ఓవర్లలో ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా ఆ స్కోరు చేయగలిగింది. మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు డివిలియర్స్‌లాంటి ఆటగాడు లేకపోవడంతో ఆ జట్టు కనీసం 300 చేయాల్సిన చోట 30 పరుగులు తక్కువగా సాధించింది. నెమ్మదిగా ఉన్న కింగ్స్‌మీడ్ పిచ్‌పై బౌన్స్ తక్కువగా కనిపించింది. దీనిని మన మణికట్టు స్పిన్నర్లు బాగా ఉపయోగించుకున్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ చక్కటి ఆటతో సెంచరీ అయితే సాధించాడు కానీ ఏ దశలోనూ అతను మననుంచి మ్యాచ్‌ను లాగేసుకునేలా కనిపించలేదు. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌లో మోరిస్ మినహా ఎవరి నుంచీ అతనికి తగిన సహకారం లభించలేదు. ఒక్కసారి మైదానంలో లైట్లు వేయగానే డర్బన్ పిచ్ వేగవంతంగా మారుతుందని చెప్పారు.
నిజానికి ఇలాంటి స్థితిలో ఆడటం రోహిత్, ధావన్‌లకు కూడా ఇష్టమే. వీరిద్దరు జట్టుకు మంచి ఆరంభమే ఇచ్చారు. మరో భారీ స్కోరు సాధించేందుకు ధావన్ సిద్ధమైన తరుణంలో కెప్టెన్ అనవసరపు పరుగు పిలుపు అతడిని పెవిలియన్ పంపించింది. ఇక ధావన్ వంతు పరుగులు కూడా తానే చేయాల్సి ఉందని కోహ్లి భావించి బాధ్యత తీసుకున్నట్లున్నాడు. రహానే తన వాండరర్స్ ఫామ్‌ను ఇక్కడా కొనసాగించి తొలి రెండు టెస్టుల్లో తనను తీసుకోకపోవడం ఎంత తప్పో మరోసారి నిరూపించాడు. భారత్ ఇప్పటికే విజయానుభూతిని రుచి చూసింది కాబట్టి దక్షిణాఫ్రికా మళ్లీ కోలుకునే అవకాశం ఇస్తుందని నేను అనుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment