
పరాజయం నుంచి కోలుకొని వెంటనే గెలుపు బాట పట్టడం ఐపీఎల్ జట్లకు ఎంతో అవసరం. ముంబై చేతిలో ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సరిగ్గా ఇదే చేసి చూపించింది. కొత్త ఓపెనింగ్ జోడితో ప్రయోగం చేసి కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆ జట్టు ఢిల్లీని ఓడించింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువ స్థానంలో రావడం తన ఆటపై ఎలాంటి ప్రభావం చూపిందంటూ సత్తా చాటిన రాయుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తాను ఎంత చక్కటి ఆటగాడో నిరూపించాడు. మ్యాచ్‌లో ఏ సమయంలో దూకుడుగా ఆడాలో, ఏ సమయంలో సింగిల్స్, రెండు పరుగులు తీసి చకచకా ఇన్నింగ్స్‌ను నడిపించాలో అతనికి బాగా తెలుసు. ఒక ఎండ్‌లో అతను ఎక్కువ సేపు పట్టుదలగా క్రీజ్‌లో నిలవడం అంటే చెన్నై జట్టు మరో ఎండ్‌లో విరుచుకుపడి భారీ స్కోర్లు చేసేందుకు అవకాశం లభించినట్లే. విధ్వంకరమైన షాట్లు ఆడుతున్న ధోని ఫామ్‌ను బట్టి చూస్తే ప్రత్యర్థి ఎంత పెద్ద లక్ష్యం విధించినా చెన్నై ఛేదించేయగలదని అనిపిస్తుంది. జట్టు బ్యాటింగ్‌లో లైనప్‌లో అనుభవజ్ఞులైన రైనా, వాట్సన్ ఉన్నారు. వీరిద్దరు కూడా ఏ సమయంలోనైనా భారీ షాట్లు ఆడగలరు. అయితే చెన్నైలో ఒకే ఒక చిన్న లోపం కనిపిస్తోంది. సన్‌రైజర్స్ మినహా ఇతర జట్లలాగే ఇక్కడ బౌలింగ్ పదునుగా లేదు. పవర్‌ప్లేలో, ఆపై చివరి ఓవర్లలో కూడా బౌలింగ్ అంత ప్రభావం చూపించడం లేదు. ఈ విషయంలో అతి చిన్న లక్ష్యాలను కూడా మంచి తేడాతో కాపాడుకోగలిగిన సన్‌రైజర్స్ బౌలర్లు మాత్రం అద్భుతమని చెప్పవచ్చు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. కార్తీక్ పేస్, స్పిన్‌ను సమర్థంగా ఉపయోగిస్తుండటంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు కొట్టడం కష్టంగా మారిపోతోంది. లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లలో సరైన బౌలర్లను ఎంచుకోకుండా తప్పు చేసిన కోల్‌కతా కెప్టెన్ ఇప్పుడు ఆ విషయంలో కుదురుకున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్‌లలో అతని వ్యూహాలను తప్పుపట్టలేం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై క్రిస్ లిన్ ప్రదర్శనను చూస్తే జట్టు బ్యాటింగ్ కూడా పటిష్టంగా మారినట్లే. లోయర్ ఆర్డర్‌లో పరిస్థితులకు తగినట్లుగా ఆడుతున్న యువ ప్రతిభావంతుడు శుబ్‌మన్ గిల్ ఉండటం కూడా జట్టుకు మేలు చేస్తోంది. ప్రత్యర్థులు షార్ట్ పిచ్ బంతులతో నరైన్‌ను పడగొడితే గిల్ ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి అక్కడ కూడా సత్తా చాటగల సమర్థుడు. ఈడెన్ మైదానం కోల్‌కతా జట్టుకు పెట్టని కోట. దీనిని పడగొట్టాలంటే ధోనికుంటే ప్రత్యేక తెలివితేటలు అవసరం.
Comments
Please login to add a commentAdd a comment