ఆటంకాలున్నా ఆగలేదు  | Suspense continues over Indian contingent as sports ministry delays official announcement | Sakshi
Sakshi News home page

ఆటంకాలున్నా ఆగలేదు

Published Thu, Aug 9 2018 1:35 AM | Last Updated on Thu, Aug 9 2018 1:05 PM

Suspense continues over Indian contingent as sports ministry delays official announcement - Sakshi

మెగా టోర్నీల్లో ఆసియా క్రీడలది విరామం లేని ప్రయాణం.  ఒలింపిక్స్, ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్, కామన్వెల్త్‌ క్రీడలకు ఎదురైనట్లు ఈ టోర్నీకి రెండో ప్రపంచ యుద్ధ అవాంతరం తలెత్తకపోవడమే దీనికి కారణం. దీంతో అప్రతిహతంగా 18వ సారి నిర్వహణకు నోచుకుంటోంది. అయితే, క్రీడలు నిలిచిపోయేంత స్థాయిలో కాకున్నా... కొన్ని వివాదాలు, మరికొన్ని బహిష్కరణలు ‘ఆట’ంక పర్చాయి. మరో తొమ్మిది రోజుల్లో ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటి గురించి పరిశీలిస్తే...  

సాక్షి క్రీడా విభాగం:ప్రస్తుతం సరిగ్గా నాలుగేళ్లకోసారి ఆసియా క్రీడలు నిర్వహిస్తున్నారు కానీ... న్యూఢిల్లీ వేదికగా తొలి పోటీలు ముగిసిన మూడేళ్లకే 1954లో ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో రెండో ఏషియాడ్‌ జరిగింది. తర్వాత నుంచి మాత్రం ‘నాలుగేళ్ల’ సంప్రదాయం తప్పడం లేదు. తొలి మూడు ఎడిషన్లు సక్రమంగానే సాగినా... ఏదో ఒక పరిణామం తలెత్తుతూ జకార్తా (ఇండోనేసియా–1962) నుంచి వివాదాలు ప్రారంభమయ్యాయి. అయితే, కొత్త శతాబ్దంలో మాత్రం ఇవన్నీ సద్దుమణగడం గమనార్హం. 

ఆ దేశాలను వద్దన్న ఇండోనేసియా... 
మతపర కారణాలతో ఇజ్రాయెల్‌కు, రాజకీయ కోణంతో తైవాన్‌కు 1962 జకార్తా ఏషియాడ్‌లో పాల్గొనేందుకు ఇండోనేసియా అనుమతి నిరాకరించింది. ఇది అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి ఆగ్రహం తెప్పించింది. క్రీడలకు స్పాన్సర్‌షిప్‌ ఉపసంహరించడమే కాక, ఇండోనేసియాను ఐఓసీ సభ్య దేశాల నుంచి తొలగించింది. ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య, అంతర్జాతీయ అమెచ్యూర్‌ అథ్లెటిక్స్‌ సమాఖ్య, అంతర్జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్యలు జకార్తా ఏషియాడ్‌ను గుర్తించబోమని ప్రకటించాయి. 

జారుకున్న దక్షిణ కొరియా... 
షెడ్యూల్‌ ప్రకారం 1970 ఆసియా క్రీడలకు దక్షిణ కొరియా ఆతిథ్యం ఇవ్వాలి.  కానీ, జాతీయ భద్రతా కారణాలను చూపుతూ చేతులెత్తేసింది. ఆర్థికంగా తట్టుకోలేమనే దక్షిణ కొరియా ఈ పని చేసిందని అంతా చెప్పుకొంటారు. దీంతో థాయ్‌లాండ్‌ వరుసగా రెండోసారి వేదికగా మారింది. జపాన్‌ సైతం ముందుకొచ్చినా ఇదే సమయంలో ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్‌ ఉండటంతో థాయ్‌లాండ్‌ వైపే మొగ్గుచూపారు. నిర్వహణ ఖర్చుకు దక్షిణ కొరియా నిధులు పంపించడం ఓ విశేషమైతే... తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్‌లలో ప్రత్యక్ష ప్రసారం కావడం ఈ ఏషియాడ్‌లోని మరో విశేషం. 

చైనా ఆగమనం... తైవాన్‌కు తిరస్కరణ... 
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 1974 క్రీడలతో చైనా టోర్నీలో అడుగిడింది. ఉత్తర కొరియా, మంగోలియాలకు సైతం తొలిసారి ప్రాతినిధ్యం దక్కింది. అరబ్‌ దేశాల వ్యతిరేకత నడుమ ఇజ్రాయెల్‌ పోటీల్లో పాల్గొంది. ‘చైనీస్‌ తైపీ’ పేరిట పాల్గొనేలా తొలుత అంగీకరించినా, తర్వాత ఆ హోదాను రద్దు చేయడంతో తైవాన్‌ తప్పుకోవాల్సి వచ్చింది. 

ఆతిథ్యం తప్పించుకున్న పాక్‌... 
ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత చూపుతూ 1978 ఆసియా క్రీడల నిర్వహణ బాధ్యత నుంచి మూడేళ్ల ముందే పాకిస్తాన్‌ తప్పుకొంది. టోర్నీ మళ్లీ థాయ్‌లాండ్‌కు మళ్లింది. 1962లో లాగానే ఇజ్రాయెల్, తైవాన్‌ ప్రాతినిధ్యాన్ని నిరాకరించారు. అంతర్జాతీయ అథ్లెటిక్‌ సమాఖ్య సహా చాలా సంఘాలు దీనిని వ్యతిరేకించాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు 1974 ఏషియాడే చివరిదైంది. తరచూ వివాదాలు తలెత్తుతుండటంతో టోర్నీకి గుడ్‌బై కొట్టి... ఐరోపా దేశాల సమాఖ్య క్రీడల్లో పాల్గొంటోంది. 

సంస్కరణల పథం... 
సంక్షోభాల నేపథ్యంలో ఆసియా దేశాల ఒలింపిక్‌ కమిటీలు ఏషియాడ్‌ రాజ్యాంగంలో సంస్కరణలకు ఉపక్రమించాయి. ఇజ్రాయెల్‌ లేకుండా 1981లో ‘ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా (ఓసీఏ)’ అవతరించింది. క్రీడల షెడ్యూల్‌ను మార్చకుండానే ముందుకెళ్లాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. 1986 నుంచి ఓసీఏ పర్యవేక్షణలోనే ఏషియాడ్‌ సాగుతోంది. 16 ఏళ్ల అనంతరం 1990లో తైవాన్‌ పునరాగమనం చేసింది. కానీ చైనా ఒత్తిడితో ‘చైనీస్‌ తైపీ’గానే దానిని పరిగణించారు.
 
ఇరాక్‌ దూరం... సోవియట్‌ దేశాల ప్రవేశం 
గల్ఫ్‌ యుద్ధం కారణంగా 1990లో పాల్గొనని ఇరా క్‌ను 1994 హిరోషిమా ఏషియాడ్‌ నుంచి బహిష్కరించారు. రాజధాని కాకుండా వేరే నగరంలో జరిగిన తొలి ఆసియా క్రీడలు ఇవే. రాజకీయ అంశాలను చూపుతూ ఉత్తర కొరియా బాయ్‌ కాట్‌ చేసింది. సోవియట్‌ యూనియన్‌ నుంచి వేరుపడిన కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ దేశం హోదాలో పాల్గొనడం విశేషం.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement