పుణేలో ఓకీఫ్.. బెంగళూరులో లియాన్!
బెంగళూరు: బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో టీమిండియాను బ్యాటింగ్ వైఫల్యాలు వెంటాడుతున్నాయి. పుణే టెస్టు తరహాలోనే విరాట్ కోహ్లీ సేన బెంగళూరులో నేడు ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట నిలిపివేసే సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. వివాదాస్పద పుణే టెస్టులో ఆసీస్ లెఫ్టార్ట్ స్పిన్నర్ ఓకీఫ్ టీమిండియా వెన్ను విరచగా, బెంగళూరు టెస్టులో ఆ పనిని మరో స్పిన్నర్ నాథన్ లియాన్ చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ స్టార్క్ ఓపెనర్ ముకుంద్ ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత పుజారా(17) తో కలిసి కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ(205 బంతుల్లో 90, 9 ఫోర్లు) చేసి ఇన్నింగ్స్ ను సరిదిద్దాడు. లంచ్ కు ముందు లియాన్ పుజారాను ఔట్ చేశాడు. ఆ తర్వాత వరుస విరామాలలో కోహ్లీ(12), రహానే(17), అశ్విన్(7), వృద్ధిమాన్ సాహా(1), జడేజా(3), రాహుల్(90), ఇషాంత్ శర్మ(0) లను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో భారత్ 189 పరుగులకే ఆలౌటయింది. లియాన్(8/50) తో చెలరేగడంతో కోహ్లీ సేన చివరి ఐదు వికెట్లను 15 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. రాహుల్ ఆదుకోకపోతే పుణే తొలి ఇన్నింగ్స్ లా పరిస్థితి తయారయ్యేది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రలియా ఎలాంటి తనబాటు లేకుండా బ్యాటింగ్ చేసింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(51 బంతుల్లో 23 నాటౌట్), రెన్ షా(47 బంతుల్లో 15 నాటౌట్) జాగ్రత్తగా ఆడటంతో ఆ జట్టు 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.