
శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం
కటక్: శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ లో టీమిండియా 169 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి శుభారంభం చేసింది. టీమిండియా విసిరిన 364 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో లంకేయులు చతికిలబడ్డారు.ఆదిలోనే శ్రీలంకకు దిల్షాన్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దిల్షాన్(18) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరగా, మిడిల్ ఆర్డర్ ఆటగాడు కుమార సంగక్కరా(13) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అనంతరం మరో ఓపెనర్ ఉపల్ తరంగ(28) పరుగులు చేసి నిష్క్రమించడంతో శ్రీలంకకు కష్టాలు ఆరంభమయ్యాయి. తరువాత జయవర్ధనే(43), మాథ్యూస్ (23), పెరీరా (29) పరుగులు మాత్రమే చేయడంతో లంకేయులు 39. 2 ఓవర్లలో 194 పరుగులకు మాత్రమే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మకు నాలుగు వికెట్లు లభించగా,ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ కు తలో రెండో వికెట్లు దక్కాయి.
ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రహానె (109), ధవన్ (113) సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. రహానె, ధవన్ జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో భారత్ కు భారీ పరుగులతో ఆకట్టుకుంది.