
ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 342/5
సిడ్నీ : ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి మెరిశాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ. ప్రస్తుతం విరాట్ (140) సాహా(14) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
ఈ రోజు ఉదయం వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (110) పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన రాహుల్ తన ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ మార్కును చేరాడు. అంతకుముందు టీమిండియా రోహిత్ శర్మను వికెట్ ను చేజార్చుకుంది. రోహిత్ (53) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ , వాట్సన్ లకు తలో రెండు వికెట్లు లభించగా, లయన్ కు ఒక వికెట్ దక్కింది.