
ధోని సేన జోరు కొనసాగించేనా?
రాజ్ కోట్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అద్భుత విజయాన్ని సాధించి మంచి ఊపుమీద ఉన్న టీమిండియా మరో పోరుకు సన్నద్ధమవుతోంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం రాజ్ కోట్ లో మూడో వన్డే జరుగనుంది. రేపు మధ్యాహ్నం గం.1.30 ని.లకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం రెండు జట్లు ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇప్పటికే చెరో వన్డేలో గెలిచి 1-1 తో సమంగా ఉన్న ఇరు జట్లు సిరీస్ లో పైచేయి సాధించాలనే తీవ్ర పట్టుదలతో ఉన్నాయి. తొలి వన్డేలో గెలిచిన సఫారీలు.. ఆ తరువాత జరిగిన రెండో వన్డేలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడ్డారు.
కాగా, టీమిండియాకు మాత్రం రెండో వన్డేలో గెలుపు మంచి ఉత్సాహాన్నిచ్చింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలక ఇన్నింగ్స్ ఆడటంతోపాటు బౌలర్లు కూడా మెరుగ్గా రాణించడంతో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో కూడా అదే పునరావృతం చేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో లక్ష్యం దగ్గర కంటే వెళ్లి చతికిలబడ్డ ధోని సేన.. రెండో వన్డేలో మాత్రం సఫారీలకు షాకిచ్చింది. ఆ మ్యాచ్ లో తొలుత దక్షిణాఫ్రికాకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్లు భావించినా.. టీమిండియా మాత్రం చివరి వరకూ పోరాడి గెలిచింది. కాగా ఆ ఓటమితో సఫారీలు మాత్రం కాస్త డీలా పడ్డారు.
అయితే ప్రధానంగా టీమిండియాలో శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి, సురేష్ రైనాలు ఆటతీరు కలవరపెడుతోంది. గత మ్యాచ్ ల్లో పెద్దగా ఆకట్టుకోలేని వీరు మూడో వన్డేలో రాణించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒకరిద్దరిపైనే ఆధారపడకుండా పూర్తిస్థాయిలో ఆడితేనే దక్షిణాఫ్రికాపై మరోవిజయాన్ని సాధించే అవకాశం ఉంది. కాగా, రెండో వన్డేలో ఓటమితో అనూహ్య షాక్ తిన్న సఫారీలు మూడో వన్డేలో మాత్రం పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండో వన్డేలో బౌలర్లు రాణించినా, బ్యాట్స్ మెన్ వైఫల్యం వల్ల దక్షిణాఫ్రికా ఓటమి చెందింది. దీన్ని అధిగమించేందుకు డివిలియర్స్ సేన కసరత్తులు చేస్తోంది. దీంతో ఇరుజట్లు మధ్య మరో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా మూడో వన్డేను అడ్డుకుంటామని ఇప్పటికే పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నాయకుడు హర్దిక్ పటేల్ హెచ్చరించడంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మ్యాచ్ సజావుగా జరిగేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టేడియం చుట్టూ 90 సీసీ కెమెరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు.