గంగూలీ.. నీ షర్ట్ తీయకు..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో గురువారం భారత్-శ్రీలంక మ్యాచ్‌లో కామెంటేటర్స్ మధ్య ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్స్‌గా వ్యవహరించిన భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్‌లు పాత విషయాలను గుర్తుచేస్తూ నవ్వులు పూయించారు. మ్యాచ్ మధ్యలో కెమెరాలు బిగ్ స్క్రీన్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను చూపించడంతో మైక్ అథేర్టెన్ గంగూలినీ ఉద్దేశించి ‘ఫ్లింటాఫ్ గ్రౌండ్‌లో ఉన్నాడు. నీవు షర్ట్‌ను తీసి తిప్పకు అని సరదాగా వ్యాఖ్యానించాడు’. దీనికి గంగూలీ ‘నీవు ఎక్కువగా ఆలోచించకు’ అని సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా గ్రౌండ్ అంతా నవ్వులు పూసాయి.
లార్డ్స్ మైదానంలో జరిగిన 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలుపొందడంతో అప్పుడు కెప్టెన్‌గా ఉన్న గంగూలీ బాల్కనీలో చొక్కా విప్పి విజయాన్ని అస్వాదించాడు. ఈ సన్నివేశం భారత క్రికెట్ చరిత్రలో మధుర ఘట్టంగా నిలిచింది. ఇది ఆండ్రూ ఫ్లింటాప్‌పై రివేంజ్‌గా దాదా అలా చేశాడని అప్పట్లో అందరూ అభిప్రాయపడ్డారు. అంతకు ముందు భారత్‌తో ఒక వన్డే మ్యాచ్‌లో ఫ్లింటాఫ్ చివరి ఓవర్ బౌలింగ్ చేసి భారత్‌కు కావల్సిని పరుగులను కట్టడిచేసి ఇంగ్లండ్‌కు విజయాన్నందించాడు. దీంతో మైదానంలోనే ఫ్లింటాఫ్ చొక్కా విప్పి తిరిగాడు. ఇది అప్పట్లో వివాదం అయింది. ఈ సన్నివేశాలను దృష్టిలో ఉంచుకొని మైక్ అథర్టన్ పై వ్యాఖ్యాలు చేశాడు.