17 కోట్ల మందిని మెప్పించాలన్నదే లక్ష్యం
17 కోట్లమంది ప్రేక్షకులను మెప్పించాలన్న లక్ష్యంగా తెరకెక్కించిన చిత్రం తూంగావనం (తెలుగులో చీకటి రాజ్యం) అన్నారు ఆ చిత్ర కథా నాయకుడు కమలహాసన్. పాపనాశం వంటి ఘన విజయం సాధించిన చిత్రం తరువాత ఈ విశ్వ నాయకుడు నటించిన ద్విభాషా చిత్రం తూంగావనం. రాజ్‌కమల్ ఇంటర్‌నేషనల్ పతాకంపై చంద్రహాసన్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించారు. ముఖ్యపాత్రలో ప్రకాష్‌రాజ్ నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రను బాలనటుడు అమాన్ అబ్దుల్ పోషించారు. కమలహాసన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన రాజేష్ సెల్వ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జిత్రన్ సంగీతాన్ని అందించారు.
చిత్రానికి నటి గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయడం విశేషం. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ కమలహాసన్ ఈ ద్విభాషా చిత్రంలో పాత్రపరంగాను, గెటప్ పరంగాను విభిన్నంగా కనిపిస్తారన్నారు. పాత్ర కనుగుణంగాను అదే సమయంలో కమలహాసన్‌కు కొత్తగా చూపించడానికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా నటి త్రిషను ఈ చిత్రంగా పూర్తిగా మార్చి చూపించినట్లు చెప్పారు. నటుడు ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ ఇంతకుముందు తాను కమలహాసన్‌తో కలిసి నటించినా ఈ తూంగావనంలో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు.
తెలుగు వెర్షన్‌కు సంభాషణలు రాసిన రచయిత రామ్‌జ్యోతి శాస్త్రి మాట్లాడుతూ కమలహాసన్ చిత్రానికి రచయితగా పని చేయడం అదృష్టంగా పేర్కొన్నారు. ఆయన ఎన్‌సైక్లోపీడియా అన్నారు. కమలహాసన్‌తో నటించిన ఈ చిత్రం తన 50వ చిత్రం కావడం తీపి గుర్తుగా నటి త్రిష అన్నారు. చివరిగా కమలహాసన్ మాట్లాడుతూ తూంగావనం సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. కిడ్నాప్‌కు గురైన కొడుకు కోసం పోరాడే తల్లిదండ్రుల ఇతివృత్తమే తూంగావనం అని చెప్పారు. దీన్ని 17 కోట్లు మందిని (తమిళం, తెలుగు) మెప్పించాలన్న లక్ష్యంగా రూపొందించినట్లు తెలిపారు. ఇకపై రాజ్‌కమల్ ఇంటర్‌నేషనల్ ఫిలింస్ పతాకంపై వరుస చిత్రాలను నిర్మించనున్నట్లు కమల్ వెల్లడించారు.