నటి హత్య కేసులో దంపతులకు జీవితఖైదు
చెన్నై కోడంబాక్కానికి చెందిన సహాయ నటి హత్య కేసులో నిందితులైన దంతులను అదనపు సెసెన్స్ కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. కోడంబాక్కంకు చెందిన రమేష్ భార్య ఆదిలక్ష్మి(50). పలు చిత్రాలలో సహాయ నటిగా నటించారు. వీరి బంధువు ప్రభావతి (35). ఈమె భర్త ఎడ్వర్డ్ జయకుమార్. బిడ్డ చదువుకు, ఇంటి బాడుగకు తరచూ ఆదిలక్ష్మి వద్ద డబ్బులు కావాలని ప్రభావతి వేధించేది. ఆదిలక్ష్మి, ప్రభావతికి నగదు ఇవ్వడానికి తిరస్కరించేది. దీంతో ఆగ్రహం చెందిన ప్రభావతి దంపతులు 2010, అక్టోబర్ 15వ తేదీ ఆదిలక్ష్మిని హత్య చేశారు.
బీరువాలో ఉన్న 4 సవర్ల నగలు, రెండు పట్టు చీరలు, ఒక కెమెరా తీసుకుని పారిపోయారు. దీనిపై పోలీసులు ప్రభావతి, జయకుమార్‌లను 18వ తేదీ అరెస్టు చేశారు. ఈ హత్య కేసుపై హైకోర్టు మొదటి అదనపు సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి మాలతి సమక్షంలో శుక్రవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ సెల్వరాజ్ హాజరయ్యారు. సాక్షుల విచారణ తరువాత నిందితులు ప్రభావతి, జయకుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి మాలతి తీర్పు ఇచ్చారు. ప్రభావతికి *22 వేలు, ఎడ్వర్డ్ జయకుమార్‌కు రూ.11 వేలు జరిమానా విధించారు.