- కత్తులతో పొడుచుకున్న స్నేహితులు
- యువకుడి దుర్మరణం
బెంగళూరు : మద్యం మత్తులో స్నేహితులు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో ఓ యువకుడు మరణించాడు. బాణసవాడి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కాచరణహళ్ళిలో నివాసముంటున్న కేశవమూర్తి (27), సోమశేఖరరెడ్డి (30) స్నేహితులు. వీరిద్దరు ఇంటిని అద్దెకు తీసి ఇచ్చే బ్రోకర్లుగా పని చేస్తున్నారు. కొంత కాలం క్రితం సోమశేఖర్‌రెడ్దికి కేశవమూర్తి రూ. 2,500 అప్పు ఇచ్చాడు. ఆ అప్పును తిరిగి ఇవ్వాలని ఆదివారం ఉదయం కేశవమూర్తి సోమశేఖర్‌ని కోరారు. ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో వారి మధ్య గొడవ జరిగింది.
సాటి స్నేహితులు ఇద్దరికి నచ్చచెప్పడం అప్పటికి శాంతించారు. ఆదివారం రాత్రి కేశవమూర్తి, సోమశేఖర్‌రెడ్డితో పాటు నలుగురు స్నేహితులు హెణ్ణూరు మెయిన్ రోడ్డులోని జ్యోతి స్కూల్ సమీపంలో ఉన్న బార్‌లో మద్యం సేవించారు. తరువాత ఇద్దరు స్నేహితులు వెళ్లిపోయారు. బార్ దగ్గర కేశవమూర్తి, సోమశేఖర్‌రెడ్డి ఉన్నారు.
ఆ సందర్భంలో వారు మళ్లీ నగదు విషయమై గొడవ పడ్డారు. మద్యం మత్తులో సహనం కొల్పోయిన వారు తమవెంట తెచ్చుకున్న కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కోలుకోలేక కేశవమూర్తి మరణించాడని పోలీసులు సోమవారం తెలిపారు.