- బడ్జెట్‌పై శెట్టర్ వాగ్బాణాలు
- నిధులను సమర్థంగా వినియోగించుకోలేని సర్కార్
- గత బడ్జెట్‌లో 57 శాతం నిధులు మాత్రమే వినియోగం
- ఈ స్వల్ప కాలంలో నిధులు ఖర్చు చేయడం సాధ్యమేనా?
- త్వరగా ఖర్చు చేయాలని చూస్తే..నిధుల దుర్వినియోగం ఖాయం
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదు.. ఖజానా ఖాళీ
- ప్రధాన రంగాలకు ప్రాధాన్యత కరువు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులైతే ఘనంగానే ఉన్నా, ఆ మొత్తాలను ఖర్చు పెట్టడంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించ లేకపోతోందని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ విమర్శించారు. శాసన సభలో సోమవారం ఆయన 2014-15 బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలో జనవరి ఆఖరు వరకు 57 శాతం మాత్రమే ఖర్చయిందని గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెలన్నర మాత్రమే ఉందని, ఈ స్వల్ప కాలంలో 43 శాతం నిధులను ఖర్చు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఆగమేఘాల మీద ఈ మొత్తాన్ని ఖర్చు చేయజూస్తే డబ్బంతా మూడో వ్యక్తి పాలవుతుందని హెచ్చరించారు.
ప్రధాన ఉద్దేశం నెరవేరదన్నారు. తన హయాంలో ఈ కాలానికి 70 నుంచి 80 శాతం నిధులను ఖర్చు చేశామని గణాంకాలతో వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదని విమర్శించారు. ఖజానా ఖాళీ అయిందా...అనే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగడం లేదని, డబ్బు ఎక్కడి పోతున్నదో అంతుబట్టడం లేదని ధ్వజమెత్తారు. ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గత ఏడాది బడ్జెట్ రూపకల్పనలో సమయం లేకపోయిందని అనుకున్నామని, ఈ ఏడాది కావాల్సినంత సమయం ఉన్నా ప్రాధాన్యత రంగాలకు తగిన కేటాయింపులు జరగలేదని విమర్శించారు.
వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు ప్రాధాన్యతనివ్వలేదని ఆరోపించారు. ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రి విఫలమయ్యారని, పన్ను సేకరణ లక్ష్యాన్ని సాధించలేక పోయారని విమర్శించారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేల అసంతృప్తి, ఆంతరంగిక కలహాలు... తదితర కారణాల వల్ల ఆయన పాలనపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించలేక పోతున్నారని ఆరోపించారు. తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారనే కీర్తిని గడించిన ముఖ్యమంత్రి, తన అనుభవాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారని నిష్టూరమాడారు.