నాకే దక్కనిది..
‘నాకే దక్కనిది నా కూతురుకు దక్కింది. ఇది చాలా గొప్ప విషయంగా భావించాలి’ అంటున్నారు నటుడు కమలహాసన్ మాజీ భార్య, నటి సారిక. వీరి కుమార్తెలు శ్రుతిహాసన్, అక్షరహాసన్. ఈ నట కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తిగానే ఉంటుంది. శ్రుతిహాసన్ తమిళం, తెలుగు, హిందీ లాంటి భాషల్లో నటిగా దుమ్ము రేపుతుంటే తాజాగా ఆమె చెల్లెలు అక్షరహాసన్ నటిగా రంగ ప్రవేశం చేశారు. శ్రుతి తొలుత లక్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసినట్లే అక్షర కూడా అక్క బాటలోనే పయనిస్తూ షమితాబ్ అనే హిందీ చిత్రంలోనే హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు.
వీరి సినీ పయనం వెనుక వాళ్ల తల్లి సారిక పాత్ర చాలా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం శ్రుతి తనీగా నివసిస్తోంది. అక్షర మాత్రం తల్లితోనే ఉంటున్నారు. అక్షర తొలుత దర్శకత్వ శాఖపై మొగ్గు చూపారు. ఆ విధంగా బాలీవుడ్ దర్శకుడు రాహుల్ దొలాక్య వద్ద శిష్యరికం కూడా చేశారు. అలాంటిది ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై ఆమె తల్లి సారిక స్పందిస్తూ దర్శకత్వంపై ఆసక్తి చూపిన అక్షర కథానాయకిగా మారడంతో తనకేమి ఆశ్చర్యం అనిపించలేదన్నారు. హిందీ చిత్రం షమితాబ్‌లో నటించే అవకాశం రాగానే తను ఒక విశ్వ విద్యాలయంలో చేరుతున్న భావం తనకు కలిగిందన్నారు. కారణం జాతీయ అవార్డు గ్రహీతలు అమితాబ్ బచ్చన్, ధనుష్‌లు ఆ చిత్రంలో నటించడమేనని అన్నారు. అక్షర గురించి ఒక్క విషయం చెప్పాలి.
తను భయం అంటే ఏమిటో తెలియని వ్యక్తి. అయినా అమాయకురాలని అన్నారు. ఏవిషయమైనా అనుభవపూర్వకంగా చేస్తుందని తెలిపా రు. తన కళ్లకు చిన్నపిల్ల అనిపించినా ఎప్పటికైనా ఆమె జీవతం గురించి తనే నిర్ణయం తీసుకోవాలి కదా అని నటి అవ్వాలనే నిర్ణయాన్ని తనకే వదిలేశానని అన్నారు. షమితాబ్ షూటింగ్ మొదలైన నాటి నుంచి ప్రతిరోజూ ఆమె కోసం తాను ఇంట్లో ఎదురు చూస్తుంటానని తెలిపా రు. నటిగా ఆమె పని గురించి తనకు బాగానే తెలుసన్నారు. ఇకపోతే అమితాబ్‌బచ్చన్ లాంటి నటుడితో తనకు బుల్లితెరపైనే నటించే అవకాశం వచ్చిందని, అలాంటిది అక్షరకు తొలి చిత్రంలోనే ఆయనతో కలిసి నటించే అవకాశం కలగడం చాలా గొప్ప విషయమని ఆనందాన్ని వ్యక్తం చేశారు.