నెల రోజుల్లో తాము సాధించిన విజయాలను వివరించడానికి సీఎం కేజ్రీవాల్ గురువారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
మంత్లీ రిపోర్ట్!నెల పాలన భేష్!
Published Thu, Jan 30 2014 10:39 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
నెల రోజుల్లో తాము సాధించిన విజయాలను వివరించడానికి సీఎం కేజ్రీవాల్ గురువారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ పాలనలో అవినీతి, అక్రమాలు తగ్గాయన్నారు. నగరంలో సౌకర్యాల కల్పనకు మరింత ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. రాజకీయ అండతో పదవుల్లోకి వచ్చిన వారిని తొలగించి సమర్థులను నియమిస్తామని ప్రకటించారు.
సాక్షి, న్యూఢిల్లీ:ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం నెల రోజుల పాలన విశేషాలను వివరించడానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం సచివాలయంలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తాము సాధించిన విజయాలను వివరించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడానికి చేసిన పనులను విశదీకరించారు. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అవినీతి తగ్గిందని కేజ్రీవాల్ చెప్పారు. లంచం అడిగేవారిని ప్రతిఘటించకుండా, వారిని పట్టించాలంటూ తాము చేసిన సూచనకు ప్రజలు భారీగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెప్పిన విషయాలన్నీ ఆయన మాటల్లోనే..
జన్‌లోక్‌పాల్ బిల్లుకు నేడే ఆమోదం
జన్‌లోక్‌పాల్ బిల్లును శుక్రవారం కేబినెట్ భేటీలో ఆమోదిస్తాం. మరో పదిపదిహేను రోజుల్లో అసెంబ్లీ సమావేశం నిర్వహించి జన్‌లోక్‌పాల్ చట్టం తెస్తాం. స్వరాజ్ చట్టం కూడా రూపుదిద్దుకుంటోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లునూ ప్రవేశపెడతాం. స్వరాజ్ చట్టం వచ్చిన తరువాత ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పరిష్కరించుకోవచ్చు. సిక్కు అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ)తో దర్యాప్తు చేయించవలసిందిగా లెఫ్టినెంట్ గవర్నర్‌ను (ఎల్జీ) కోరాను. వచ్చే వారం కేబినెట్ సమావేశంలో ఎస్‌ఐటీ ఏర్పాటు ప్రతిపాదనను ఎల్జీ ఆమోదం కోసం పంపుతాం. సిక్కు అలర్ల అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది. ఢిల్లీలో ఐదేళ్లు, కేంద్రంలో ఆరేళ్లు అధికారంలో ఉండి కూడా ఆ పార్టీ దీనిపై విచారణకు ఆదేశించలేదు. మా ప్రభుత్వం వీఐపీ సంస్కృతికి వీడ్కోలు పలికింది. ఒక స్లాబ్ వరకు కరెంటు చార్జీలను సగానికి తగ్గించాం. డిస్కమ్‌ల ఖాతాలపై కాగ్ ఆడిట్‌కు ఆదేశించాం. మీటర్ల తనిఖీ కోసం థర్డ్ పార్టీలను నియమిస్తాం. మీటర్లు వేగంగా తిరుగుతున్నాయని భావించేవారు ఫిర్యాదు చేస్తే తనిఖీలు జరుపుతారు.
మరిన్ని పైపులైన్లు నిర్మిస్తాం..
ప్రతి ఇంటికి రోజుకు 20 వేల లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాం. అయితే ఢిల్లీలో నీటి సరఫరా లేని ప్రాంతాలెన్నో ఉన్నాయి కాబట్టి మరిన్ని పైపులైన్లు వేయాల్సి ఉంది. ప్రతి ఇంటికీ నీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ట్యాంకర్ మాఫియా ఆగడాలను అరికట్టి, పారదర్శకతను తేవడానికి ప్రయత్నిస్తున్నాం. నీటి విషయంలో స్వయంసమృద్ధి సాధించేందుకు చర్యలు చేపట్టవలసి ఉంది. ఇందుకోసం మిలీనియం డిపోను ఖాళీ చేయిస్తాం.
మరిన్ని నైట్‌షెల్టర్ల ఏర్పాటు
నర్సరీ అడ్మిషన్ల సమస్యల పరిష్కారానికి ప్రారంభించిన హెల్ప్‌లైన్ తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడుతోంది. ఢిల్లీ, రాజధాని ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్) మధ్య రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు 5,500 ఆటోలకు పర్మిట్లు ఇచ్చాం. నెలరోజుల్లో మా ప్రభుత్వం 58 నైట్‌షెల్టర్లను ఏర్పాటుచేసింది. నగరంలో లక్ష మంది నిరాశ్రయులున్నారు. వాళ్లందరికీ ఆశ్రయం కల్పించడానికి మరిన్ని నైట్‌షెల్టర్లను ఏర్పాటుచేస్తాం. రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రద్దు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాం. మహిళల భద్రత కోసం సిఫార్సులు చేయడం కోసం కమిటీని నియమించాం.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకూ ఓ కమిటీ నియమించాం. ఇది నెల రోజుల్లో నివేదిక సమర్పిస్తుంది. నివేదిక వచ్చే దాకా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించబోమని స్వయంగా హామీ ఇచ్చినా, వాళ్లు ధర్నా చేస్తున్నారు. ఆందోళన విరమించి విధులకు హాజరు కాకుంటే, వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తాం. ధర్నా కొనసాగించేవారిని పర్మనెంట్ చేయబోం. ప్రభుత్వం సమగ్ర ఆరోగ్య ప్రణాళిక రూపొందిస్తోంది. దానికి సంబంధించిన వివరాలను వారం రోజుల్లో వెల్లడిస్తాం.
అన్ని పదవులకూ కొత్త వారిని నియమిస్తాం..
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థల్లో తన వాళ్లను సభ్యులుగా నియమించింది. రాజకీయ నేపథ్యంలో పదవులు దక్కించుకున్న వారందరినీ తొలగించి నిష్పక్షపాత ప్రక్రియ ద్వారా యోగ్యులను నియమిస్తాం. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన 28 కాలేజీల పాలకమండళ్లలోని సభ్యులంతా కాంగ్రెస్ వాళ్లే. వారిని తొలగించి విద్యావేత్తలను నియమించడానికి దరఖాస్తులను ఆహ్వానించాం. స్టాండింగ్ కౌన్సిళ్లలో ఇప్పుడున్న (కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్నవారు) వారిని తీసేసి సమర్థులైన న్యాయవాదులను నియమిస్తాం. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బర్ఖాసింగ్‌ను తొలగించి ఆమె స్థానంలో రచయిత్రి మైత్రేయి పుష్పను నియమిస్తాం. బర్ఖాసింగ్ కాంగ్రెస్ ప్రతినిధి. ఆమె నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని కేజ్రీవాల్ ఆరోపించారు. పుష్ప రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి. ఆమె నెలకు ఒక రూపాయి వేతనంతో పనిచేస్తారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివరించారు. అయితే బర్ఖాసింగ్‌ను తొలగించాలన్న ప్రతిపాదనను ఎల్జీ తిరస్కరించారు.
Advertisement
Advertisement