ఇక్బాల్, రామ్‌బీర్ యూటర్న్
Published Mon, Feb 3 2014 11:45 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ వర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురైన తాజా ముప్పు టీకప్పులో తుపానులా తేలిపోయింది. ముఖ్యమంత్రి తమ డిమాండ్లకు అంగీరించారు కాబట్టి సంతృప్తి చెందామని ఎమ్మెల్యేలు షోయబ్ ఇక్బాల్, రామ్‌బీర్ షౌకీన్ ప్రకటిం చారు. తాము ఆప్ సర్కారు వెంటే ఉంటామని సోమవారం కేజ్రీవాల్‌ను కలిసిన తరువాత జేడీ(యు) ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్, స్వతంత్ర ఎమ్మెల్యే రామ్‌బీర్ చెప్పారు. ప్రభుత్వం 48 గంటల్లో తమ డిమాండ్లకు అంగీకరించకుంటే మద్దతు ఉపసంహరించుకుంటామని ప్రకటించిన బిన్నీ వర్గం సోమవారం మాటమార్చింది.
సర్కారును వ్యతిరేకిస్తున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలసి మధ్యాహ్నం ఒంటి గంటకు విలేకరుల సమావేశం నిర్వహిస్తామని ప్రకటించిన ట్టు చెప్పి బీన్నీ అలా చేయలేదు. బిన్నీతో కలిసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన షోయబ్ ఇక్బాల్, రామ్‌బీర్ షౌకీన్ ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తరువాత వారు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని, తమ ఐదు డిమాండ్లకు ఆయన అంగీకరించడంతో సంతృప్తి చెందామని ప్రకటించారు. అదనపు నీటిని వాడితే 10 శాతం సర్‌చార్జి విధించకుండా 700 లీటర్ల నీటిని ఇంటింటికీ సరఫరా చేయాలని, మహిళా సురక్షాదళ్‌ను తక్షణం ఏర్పాటు చేయాలని, బిల్లుల రద్దుపై ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, విద్యుత్ సర్‌చార్జిని ఉపసంహరించాలని,
కామన్వెల్త్ క్రీడల అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని బిన్నీ వర్గం డిమాండ్ చేసింది. వీటితోపాటు లాల్‌డోరా, పురానీదిల్లీ వికాస్ బోర్డుకు సంబంధించిన తమ డిమాండ్లకు కూడా కేజ్రీవాల్ అంగీకరించారని షోయబ్ ఇక్బాల్ చెప్పారు. షౌకీన్, బిన్నీ, తాను కలిసి ఢిల్లీ వికాస్ మోర్చాను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. బీజేపీతో చేతులు కలిపానని సంజయ్ సింగ్ చేసిన ఆరోపణలను బిన్నీ ఖండించారు. తాను అకాలీదళ్ శాసనసభ్యుడు మంజిందర్ సింగ్ సిర్సా కూడా తమ మోర్చాలో చేరనున్నాడని తెలిపారు. ఈ విషయమై తాను ఆయనను కలిశానని ఆయన చెప్పారు.
Advertisement
Advertisement