హైకోర్టులో ‘బాంబు’ | Bomb hoax causes a flutter at Madras high court | Sakshi
Sakshi News home page

హైకోర్టులో ‘బాంబు’

Published Wed, Sep 3 2014 12:07 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

హైకోర్టులో ‘బాంబు’ - Sakshi

హైకోర్టులో ‘బాంబు’

 సాక్షి, చెన్నై: మద్రాసు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి వచ్చిన ఓ ఫోన్ కాల్ పోలీసుల్ని పరుగులు తీయించింది. కాసేపట్లో హైకోర్టులో బాంబులు పేలనున్నాయన్న ఆ హెచ్చరికతో ఆ పరిసరాలను నిఘా వలయంలోకి తెచ్చారు. అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలకు, వీఐపీల ఇళ్లకు, విమానాశ్రయాలకు బాంబు బూచీలు పెరిగాయి. ఇవి బూచీలుగా తేలుతున్నా, పోలీసులకు, బాంబ్, డాగ్ స్క్వాడ్‌లకు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అయితే, ఈ బెదిరింపు కేసుల్లో అజ్ఞాత వ్యక్తుల్ని గుర్తించడం సైబర్ క్రైం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఉదయం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి వచ్చిన ఓ ఫోన్‌కాల్ అక్కడి సిబ్బందిని, పోలీసులను ఆందోళనకు గురిచేసింది.
 
 బూచీతో పరుగు: ఉదయం 10.15 గంటలకు ఆ కార్యాలయానికి వచ్చిన ఫోన్‌కాల్‌ను అక్కడి సిబ్బంది సురేంద్రన్ రిసీవ్ చేసుకున్నారు. హైకోర్టు పరిసరాల్లో బాంబులు అమర్చామని, మరి కాసేపట్లో అవి పేలబోతున్నాయంటూ అవత లి వ్యక్తి బెదిరించి లైన్ కట్ చేశాడు. ఈ సమాచారాన్ని రిజిస్ట్రార్ జనరల్ కళైయరసు దృష్టికి తీసుకెళ్లారు. వెను వెంటనే అక్కడి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, కంట్రోల్ రూంకు ఆయన సమాచారం అందించారు. ఆగమేఘాలపై పోలీసు బలగాలు, డాగ్, బాంబు స్క్వాడ్‌లు అక్కడికి చేరుకుని అణువణువు తనిఖీలు చేశాయి. హైకోర్టు ఆవరణలో ప్రధాన బెంచ్‌తో పాటుగా 36 కోర్టుల్లో విచారణ సాగుతున్న సమయంలో ఈ  బెదిరింపు రావడంతో ఉద్రిక్తత నెలకొంది.
 
 సీఎం జయలలిత దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులతో పాటుగా మరికొన్ని కేసుల విచారణ వాడివేడిగా సాగుతున్న సమయంలో ఆయా కోర్టుల్లోకి పోలీసులు డాగ్, బాంబ్ స్క్వాడ్‌తో ప్రవేశించడంతో న్యాయమూర్తులు సైతం కంగారు పడ్డారు. వారి దృష్టికి అసలు విషయాన్ని తీసుకెళ్లినానంతరం, తనిఖీలకు న్యాయమూర్తులు అనుమతించారు. దీంతో ఆయా కోర్టుల గదుల్లో తనిఖీలు క్షుణ్ణంగా చేశారు. హైకోర్టు పరిసరాల్లోను, చాంబర్లలోను తనిఖీలు చేసినా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించ లేదు. అయితే, ఈ బూచీ కారణంగా హైకోర్టు పరిసరాల్లో మధ్యాహ్నం వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయినా, పోలీసులు ఆ పరిసరాల్లో నిఘాను కట్టుదిట్టం చేసి అప్రమత్తంగా వ్యవహరించారు. అలాగే, ఈ బెదిరింపు కాల్ చేసిన  వ్యక్తి కోసం అన్వేషణ ఆరంభమైంది. కోర్టు విధులకు ఆటంకం కలిగించే రీతిలో వ్యవహరించిన ఆ వ్యక్తిని త్వరితగతిన అరెస్టు చేయడానికి పరుగులు తీస్తున్నారు. లేని పక్షంలో ఎక్కడ కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనన్న బెంగ పోలీసుల్లో నెలకొనటం గమనార్హం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement