సాక్షి ప్రతినిధి, బెంగళూరు :
శాసన సభ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శల దాడికి దిగుతున్నప్పుడు మంత్రులు చోద్యం చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. బెల్గాంలోని సువర్ణ సౌధలో మంగళవారం జరిగిన సీఎల్‌పీ సమావేశంలో ఇకమీదట మంత్రులతో పాటు తాము కూడా ప్రతిపక్షాలకు తగు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. సభలో మంత్రులే కాదు తాము కూడా ముఖ్యమంత్రికి అండగా నిలబడడం లేదని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు నిష్టూరమాడారు. ఇకమీదట అలా జరుగకుండా చూడాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆయా శాఖల మంత్రులు ప్రభుత్వ విధానాలను సమర్థించాల్సింది పోయి భారమంతా ముఖ్యమంత్రిపైనే మోపుతున్నారని కొందరు సీనియర్లు ఆరోపించారు. దీనిపై అందరూ దృష్టి సారించాలని సూచించారు. మంత్రులు మౌనం పాటిస్తే, సమన్వయం లేదనే విషయం ప్రస్ఫుటమవుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై అగ్గి మీద గుగ్గిలమవుతుంటే...వారిని సముదాయించడం ముఖ్యమంత్రికి తలకు మించిన భారమైంది. మున్ముందు అంతా సర్దుకుంటుందంటూ చివరికి వారికి నచ్చజెప్పగలిగారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, షాదీ భాగ్య, చెరకు రైతుల సమస్యలపై సమావేశంలో చర్చించామని తెలిపారు.
అంబరీష్, మంజు మాటా మాటా
సమావేశం అనంతరంృగహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్, హాసన జిల్లా అరకలగూడు ఎమ్మెల్యే మంజు మధ్య స్వల్ప స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ‘మంత్రులు ముఖ్యమంత్రికి అండగా నిలబడడం లేదని అంటున్న నిన్ను, సభలో మాట్లాడవద్దని ఎవరైనా చెప్పారా’ అని అంబరీశ్ మంజును ఉద్దేశించి అన్నారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ తొలుత మంత్రులు ఈ పని చేయాల్సి ఉంటుందని చురక అంటించారు. ‘ప్రభుత్వంలో ఉన్న మీరు ప్రభుత్వ విధానాలను సమర్థించుకోలేరా’అని ప్రశ్నించారు. తర్వాత అంబరీశ్ మాట్లాడకపోవడంతో మంజు తన దారిన వెళ్లిపోయారు.
సీఎంపై విమర్శలకు స్పందించరేం?
Published Wed, Nov 27 2013 2:05 AM | Last Updated on Mon, Mar 18 2019 8:57 PM
Advertisement
Advertisement