తమిళనా డు రాజకీయ వినీలాకాశంలో మరో నేత త్వరలో మెరవనుంది.
► రాజకీయ ప్రవేశంపై ముమ్మరంగా అభిప్రాయసేకరణ
►పురట్చిమలర్ (విప్లవ పుష్పం) దీపగా ప్రచారం
►ఫిబ్రవరి 24న సేలంలో దీప పేరవై మహానాడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనా డు రాజకీయ వినీలాకాశంలో మరో నేత త్వరలో మెరవనుంది. పురట్చిమలర్ దీప (విప్లవ పుష్పం) అనే నామకరణం కూడా జరిగిపోయింది. ఈనెల 17వ తేదీన ఎంజీఆర్ శత జయంతిరోజున అధికారికంగా ప్రకటించనున్నట్లు దీప సోమవారం తెలియజేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి గా శశికళ ఎంపికను ససేమిరా అంటున్న పార్టీ శ్రేణులన్నీ దీప ఇంటి బాటపడుతున్నాయి. చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి 15 రోజులుగా తండోపతండాలుగా కార్యకర్తలు వస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు దీప పలువురు రాజకీయపెద్దలను, శ్రేయోభిలాషులను కలుసుకుంటున్నారు. దీప ఇంట్లో లేని సమయాల్లో ఆమె భర్త మాధవన్, సాయంత్రం వేళల్లో దీప ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇంటి వద్ద ఒక రిజిస్టర్‌ను అందుబాటులో పెట్టి తన కోసం వచ్చేవారి పేరు, చిరునామా, సెల్‌ఫోన్ నంబరుతోపాటు అభిప్రాయాలను నమోదు చేసేందుకు ఏర్పాటు చేశారు. చెన్నై టీనగర్‌లోని ఆటో స్టాండ్ వారు దీప చిత్రంతో కూడిన స్టిక్కర్లను అంటించుకుని మద్దతు తెలిపారు.
మరో విప్లవం: అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ ను పురట్చితలైవర్ (విప్లవనాయకుడు), దివంగత జయలలితను పురట్చితలైవి(విప్లవనాయకి) అని తమిళనాడు ప్రజలు పిలుచుకుంటారు. ఇదే కోవలో దీపకు ‘విప్లవమలర్’(విప్లవ పుష్పం) అని పిలుచుకోవడం ప్రారంభించారు. విప్లవమలర్ దీప, కాబోయే ముఖ్యమంత్రి పేరుతో క్యాలెండర్లు, స్టిక్కర్లు చలామణిలోకి వచ్చేశాయి.
17న ముహూర్తం: దీప ఇంటికి వస్తున్న ప్రజానీకం ప్రతిరోజూ అడిగేది ఒకటే ప్రశ్న. ‘రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు? ఈ ప్రశ్నకు సోమవారం దీప బదులిచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల శుభసమయాన ఈనెల 17న తన రాజకీప్రవేశంపై ప్రకటన చేస్తానని తెలిపారు. అమ్మ పేరు, ప్రతిష్టలు నిలబెట్టేలా అందరూ ఆశిస్తున్నట్లే తన నిర్ణయం ఉంటుంది, తనపై అభిమానంతో తరలివచ్చేవారి కోసం పనిచేస్తానని ఆమె అన్నారు. 17వ తేదీ నుంచి తన రాజకీయ పయనం కొనసాగుతుందని తెలిపారు.
వచ్చే నెల 24న దీపా పేరవై మహానాడు: జయలలిత జన్మదినమైన ఫిబ్రవరి 24వ తేదీన సేలంలో జయలలిత దీపాపేరవై మహానాడు నిర్వహించి సభ్యత్వ నమోదు వివరాలను వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పేరవై రాష్ట్ర కన్వీనర్ జీఆర్.రామచంద్రన్ మాట్లాడుతూ, ఇంతవరకు 28 జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోందని అన్నారు.