
మోడీ ప్రమాణ స్వీకారంట్రాఫిక్ ఆంక్షలు
నగరవాసులకు సోమవారం ఆంక్షల తిప్పలు ఎదురుకానున్నాయి. దేశ నూతన ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ర్టపతి భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు
న్యూఢిల్లీ: నగరవాసులకు సోమవారం ఆంక్షల తిప్పలు ఎదురుకానున్నాయి. దేశ నూతన ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ర్టపతి భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలవరకూ అమల్లో ఉంటాయి. రాజ్‌పథ్ (విజయ్‌చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్) విజయ్ చౌక్‌తోపాటు ఉత్తర, దక్షిణ ఫౌంటైన్లు, సౌత్ ఎవెన్యూ మార్గ్, నార్త్ ఎవెన్యూ మార్గ్, డల్లా హౌసీ, చర్చిరోడ్ మార్గాలను పూర్తిగా మూసివేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులతోపాటు మీడియా ప్రతినిధులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రాఫిక్ పోలీసు విభాగం తెలియజేసింది. వీవీఐపీల రాకపోకలకు ఎంతమాత్రం అంతరాయం కలగకుండా చేసేందుకు రహదారులను మూసివేయడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రైసినా హిల్స్, పండిట్ పంత్ మార్గ్, కె కామరాజ్ మార్గ్‌ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఇంకా మోతీలాల్ నెహ్రూమార్గ్, ఉద్యోగ్‌భవన్, ఈ-బ్లాక్, సెక్యూరిటీ లైన్స్ రోడ్, మదర్ థెరిస్సా క్రిసెంట్, సర్దార్ పటేల్‌మార్గ్, శంకర్‌రోడ్, ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి పరిసరాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఇక ఈ మార్గాల్లో ఆది, సోమవారాల్లో ద్విచక్ర వాహనదారులతోపాటు సాధారణ పౌరులను అనుమతించరు.
రాష్ర్టపతి భవన్‌కు అసాధారణ భద్రత
భారత నూతన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ప్రాంగణం శత్రు దుర్భేధ్యంగా మారిపోయింది. రాష్ట్రపతి భవన్ చుట్టుపక్కల సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు నేల, నింగి, నీరు మొత్తం భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. వైమానిక సిబ్బందితోపాటు సుమారు ఆరు వేల మంది పార్లమెంటరీ కమెండోలు, పోలీస్ షార్ప్ షూటర్లను ఇందుకోసం వినియోగిస్తున్నారు. విదేశీ అతిథులతోపాటు సుమారు 3 వేల మంది ప్రముఖుల మధ్య మోడీతో రాష్ట్రపతి బహిరంగంగా ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఢిల్లీ పోలీస్ విభాగం, పీఎం సెక్యూరిటీ విభాగం కలిసి బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేశాయి. ఇందులో భాగంగా నేల, నింగిని తమ అధీనంలోకి తీసుకున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక నుంచి వచ్చే అతిథులు బసచేసే హోటళ్లవద్ద భద్రతా ఏర్పాట్లను పోలీసులు సమీక్షించనున్నారు. అదే విధంగా ఆకాశ మార్గాన భద్రతను ఐఏఎఫ్ అధికారులు చేపట్టారు. ఆఫ్ఘానిస్థాన్‌లో భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాదులు దాడిచేసిన నేపథ్యంలో సోమవారం నాటి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి అసాధారణ భద్రతను ఏర్పాటుచేశారు.