సర్వజనుల సంక్షేమమే మా విధానం
Published Sat, Nov 30 2013 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
న్యూఢిల్లీ: సర్వజనుల సంక్షేమం, సంతోషమే బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) విధానమని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పేర్కొన్నారు. ఢిల్లీ విధానసభకు జరుగుతున్న ఎన్నికల కోసం దక్షిణ ఢిల్లీలోని నానక్‌పురాలో నిర్వహించిన బహిరంగ సభలో మాయావతి మాట్లాడారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న షీలాదీక్షిత్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి మయమైందని, పరప్రాంతీయుల కోసం షీలా ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శిం చారు. సర్వజనుల సంక్షేమం కోరే బీఎస్పీకి ఓటువేసి గెలిపిస్తే ఉత్తరప్రదేశ్‌లాగా ఢిల్లీలోని పేదలకు కూడా తలెత్తుకు బతికే పరిస్థితి కల్పిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పేదలకు తమ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చిందని, యువతకు ఉపాధి కల్పిం చిందని, పేదలు కూడా హుందాగా బతికే పరిస్థితి కల్పించామన్నారు. ఇవన్నీ కావాలనుకుంటే బీఎస్పీకి ఓటువేసి గెలిపించాలన్నారు.
2008లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ నగరంలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 14.05 శాతం ఓట్లను కొల్లగొట్టిన బీఎస్పీ ఈ ఏడాది తమ ఓటింగ్ శాతాన్ని మరింతగా పెంచుకోవాలని భావిస్తోంది. బీఎస్పీ నుంచి పోటీ చేసినవారిలో ఇద్దరు గెలవగా ఈసారి వారి సంఖ్య కూడా పెంచుకోవాలనే కృతనిశ్చయంతో ఉంది. మొత్తం 70 నియోజకవర్గాలున్న ఢిల్లీ విధానసభకు జరుగుతున్న ఎన్నికల్లో బీఎస్పీ నుంచి 69 మంది పోటీపడుతున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల బరిలోకి దిగడంతో బీఎస్పీ నాలుగోస్థానానికే పరిమితం కావాల్సిన పరిస్థితి నెల కొందని ముంద స్తు సర్వేలు చెబుతున్నాయి.
Advertisement
Advertisement