
చిక్కుల్లో లింగా
సూపర్ స్టార్ చిత్రానికీ చిక్కులు తప్పలేదు. విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉండడం గమనార్హం. ఆ చిత్ర కథ తనదని ఒకరు కోర్టుకు వెళ్లి, రూ.10కోట్లు కోర్టులో డిపాజిట్ చేసేలా చేశారు. మరోవైపు చిత్ర నిర్మాతలకు, సినీ థియేటర్ యాజమాన్యాలకు విభేదాలు తలెత్తడంతో కొన్ని చోట్ల చిత్ర ప్రదర్శనపై అయోమయం నెలకొంది. దీంతో అభిమానుల్లో అసంతృప్తి నిండిపోయింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి:సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లింగా చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే అదే సమయంలో అనేక చిక్కుముడులను ఛేదించుకోవాల్సి వచ్చింది. రోబో తరువాత రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్ ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఈ స్థితిలో రజనీ స్టరుుల్ మసాలా ఫార్ములాతో కూడిన లింగా చిత్రం షూటింగ్ ప్రారంభం కావడంతో అభిమానులు ఉత్సాహంతో ఉరకలేశారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ వారిలో ఉత్సాహం రెట్టింపైంది. అయితే లింగా చిత్రాన్ని చుట్టుముట్టిన అనేక వివాదాలు అభిమానుల ఆనందంపై నీళ్లు చల్లాయి.
రూ.10 కోట్లు చెల్లిస్తేనే విడుదల: లింగా చిత్ర కథ తనదంటూ మదురై హైకోర్టులో రవిరత్నం
అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం తలె త్తింది. తాను రచించిన ముల్లైవనంలోని కథాంశాన్ని లింగాకు వాడుకున్నందున చిత్రం విడుదలపై స్టే విధించాలని కోరాడు. చిత్రం విడుదల కాకుండానే ఆ చిత్ర కథను అనుమానించడం తగదయి, విడుదల తర్వాత నిర్ధారణైతే కోర్టు ద్వారా నష్టపరిహారం పొందవచ్చని కోర్టు సూచించి వాయిదావేసింది. దీంతో పిటిషన్‌దారుడు మద్రాసు హైకోర్టులో అదే రీతిన కేసువేసినా చిత్రం విడుదలపై నిషేధం విధించేందుకు కోర్టు తిరస్కరించింది.
రవిరత్నం పిటిషన్ మదురై హైకోర్టులో గురువారం మళ్లీ విచారణకు వచ్చింది. హైకోర్టు రిజిస్ట్రారు వద్ద లింగా నిర్మాతలు రూ.10 కోట్లు డిపాజిట్టు చేసి చిత్రాన్ని విడుదల చేసుకోవాలని న్యాయమూర్తులు ధనబాలన్, వేలుమణి ఆదేశించారు. శుక్రవారం (12వ తేదీ) మధ్యాహ్నం 12 గంటల్లోగా ఈ సొమ్ము చెల్లించాలని షరతు విధించారు. ఈ నిబంధనకు లోబడే చిత్రాన్ని విడుదల చేసుకోవాలని స్పష్టం చేశారు. చిత్రం కథ తనదైన పక్షంలో పిటిషన్‌దారుడు రవిరత్నం కోర్టు ద్వారా నష్టపరిహారం పొందవచ్చని న్యాయమూర్తులు పునరుద్ఘాటించారు.
మరోవైపు లింగా చిత్రం హక్కుల అమ్మకాల్లో థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య వివాదం తలెత్తింది. అధికరేటును చెప్పడంతో థియేటర్ యాజమాన్యాలు వెనక్కుతగ్గాయి. ఈ కారణంగా రాష్ట్రంలోని అనేక థియేటర్లలో లింగా చిత్రాన్ని ప్రదర్శిస్తారో లేదో అనే అనుమానాలు మొదలయ్యూయి. తిరుచ్చిలో గురువారం వరకు లింగా ప్రదర్శనకు థియేటర్లు ఖరారు కాలేదు. ఈ పరిణామాలతో రజనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగా విడుదలను అడ్డుకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
5వేల థియేటర్లలో విడుదలకు సిద్ధం
కోర్టులో పిటిషన్లు, వివాదాలు నడుమ లింగా చిత్రం విడుదలకు నిర్మాతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 5వేల థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే 328 థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులో 7వేల థియేటర్లు లింగా కోసం సిద్ధమయ్యూయి. ఈ సందర్భంగా తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం సహాయ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ, సహజంగా డిసెంబరులో థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తాయి. ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరని తెలిపారు.
అయితే ఈ ఏడాది లింగా చిత్రం విడుదల కావడంతో ఎన్నడూ లేని సందడి నెలకొందన్నారు. రిజర్వేషన్ బుకింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే వారం రోజులకు ఫుల్ అయిపోయినట్లు ఆయన తెలిపాడు. ఇదిలా ఉండగా రజనీ అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు సిద్ధమయ్యూరు. రజనీకాంత్ 65వ పుట్టిన రోజునే లింగా చిత్రం విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. కటౌట్లు, పతాకాలతో నగరాలను అలకరించి పండుగ వాతావరణం సృష్టించారు. రక్తదానం, అన్నదానం, చీరలు, పంచెలు, స్వీట్లు పంపిణీ వంటి సేవాకార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకోవడం విశేషం.