నిధుల ఊసే లేదు | DV Sadananda Gowda: All you want to know about Railway | Sakshi
Sakshi News home page

నిధుల ఊసే లేదు

Published Wed, Jul 9 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

నిధుల ఊసే లేదు

నిధుల ఊసే లేదు

 కర్ణాటకకు చెందిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ యూపీఏ తరహాలో తమిళనాడు మీద సవతి తల్లి ప్రేమ చూపించారు. దక్షిణాది జిల్లాలకు పూర్తిగా హ్యాండిచ్చిన సదానంద, చెన్నై నుంచి ఇతర రాష్ట్రాలకు మాత్రం ఐదు రైళ్లను కంటి తుడుపు చర్యగా ప్రకటించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధుల ఊసే లేని దృష్ట్యా, తమిళనాట రైల్వే బడ్జెట్‌కు వ్యతిరేకంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 సాక్షి, చెన్నై:రాష్ట్రంలోని పెండింగ్, అమల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సుమారు పది వేల కోట్ల మేరకు నిధులు అవసరం. కొన్నేళ్ల క్రితం చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండడంతో ఏటా అంచనా వ్యయం పెరుగుతోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూపీఏ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపించింది. ప్రస్తుతం అధికారం మారడంతో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ప్రజలు భావించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంతో సామరస్య పూర్వంగా మెలిగేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆసక్తి చూపినా కేంద్రం వైఖరి మాత్రం మారలేదు.
 
 హ్యాండిచ్చిన సదానంద: తమిళనాడులో అనేక రైల్వే ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రధానంగా చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, దక్షిణాది జిల్లాలోని పలు ప్రధాన నగరాల్ని కలుపుతూ కొత్త రైళ్ల సేవలకు ప్రతిపాదనలున్నారుు. అయితే, తమిళనాడుకు సదానంద హ్యాండిచ్చారు. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు కనీసం ఒక్క రైలు కూడా ప్రకటించ లేదు. ఇటీవల డీఎంకే ఎంపీ కనిమొళి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పొన్ రాధాకృష్ణన్ చేసిన విజ్ఞప్తుల్ని సైతం సదానంద ఖాతరు చేయలేదు. అమల్లో ఉన్న పనులకు కనీసం నిధుల కేటాయింపు కూడా చేయలేదు. దీంతో ఆ పనులు పూర్తవడానికి మరెన్ని నెలలు పట్టనుందోనని ప్రశ్నార్థకంగా మారుతోంది.
 
 నిరాశే : విల్లుపురం - దిండుగల్ మధ్య రెండో మార్గం పనులకు, పళని - పొల్లాచ్చి మార్గం పనులకు, మదురై - కన్యాకుమారి రెండో మార్గం, మదురై - బోడి నాయకనూర్, తెన్‌కాశి - పునలూర్, మార్గాల్లో జరుగుతున్న పనులకు నిధుల ఊసెత్తక పోవడం గమనార్హం. అలాగే, చెన్నై సెంట్రల్, ఎగ్మూర్‌లకు ప్రత్యామ్నాయంగా తాంబరం, రాయపురం స్టేషన్ల కొత్త టెర్మినల్ ప్రకటన వెలువడుతుందని ఎదురు చూసిన వాళ్లకు చివరకు మిగిలింది నిరాశే. అయితే, మౌళిక వసతుల కల్పం, రైల్వే ప్రయాణికుల భద్రత, మహిళా భద్రత ప్రకటనలు మాత్రం స్వాగతిస్తున్నారు.
 
 కంటి తుడుపు చర్య : తమిళనాడు ప్రజలకు హ్యాండిచ్చిన సదానంద గౌడ కంటి తుడుపు చర్యగా కొన్ని రైళ్లను ప్రకటించారు. ఇవన్నీ చెన్నై నుంచి బయలు దేరే రైళ్లే. దక్షిణాదిలోని మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, తిరుచ్చి నగరాలకు మిగిలింది నిరాశే. అరుుతే చెన్నై - హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు సేవలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు వేలాంకన్ని, మేల్ మరువత్తుర్‌లకు ఉత్సావల సమయంలో ప్రత్యేక రైళ్లను నడుపుతామన్న హామీని మాత్రం ఇచ్చారు.
 
 ఐదు రైళ్లు : పార్లమెంట్‌లో ప్రకటించిన రైల్వే బడ్జెట్ మేరకు ఐదు రైళ్ల వివరాలు. మదురై - జైపూర్ (వారంతాపు ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్),  చెన్నై - షాలిమార్ (ప్రీమియర్ ఏసీ ఎక్స్‌ప్రెస్),  చెన్నై - అహ్మదాబాద్ (వారంలో రెండు రోజులు రైలు సేవ),- చెన్నై - విశాఖ (వారంతపు రైలు),  హోసూరు - యశ్వంత్ పూర్ రైలు. చెన్నై - హైదరాబాద్ (బుల్లెట్ రైలుకు ప్రాధాన్యత).
 
 సర్వత్రా విమర్శ : ఈ  బడ్జెట్‌ను తమిళనాడులోని రాజకీయ పక్షాలు తీవ్రంగా విమర్శించాయి. తమిళ ప్రజల్ని పూర్తిగా విస్మరించారని పీఎంకే ఎంపీ అన్భుమణి  ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రైళ్లను తన సొంత రాష్ట్రానికి మంత్రి తరలించుకున్నారని సీపీఎం ఎంపీ రంగరాజన్ మండిపడ్డారు. తమిళ ప్రజలకు మొండి చేయి మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పాటనే మళ్లీ మళ్లీ పాడినట్టు, చివరకు తమిళ ప్రజల నెత్తిన టోపీ పెట్టారని  కాంగ్రెస్ ఎంపీ సుదర్శన నాచ్చియప్పన్ పేర్కొన్నారు. తమిళుల ఆశల్ని, విజ్ఞప్తులపై మోడీ ప్రభుత్వం నీళ్లు చల్లిందని మండి పడ్డారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ సైతం రైల్వే బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు.
 
 ఆహ్వానం : సీఎం జయలలిత మాత్రం రైల్వే బడ్జెట్‌ను ఆహ్వానించారు. భవిష్యత్తును కాంక్షిస్తూ ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టుందన్నారు. స్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైళ్ల సేవలు, మహిళలకు భద్రత, రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రకటనలు సంతృప్తినిచ్చాయన్నారు. ముంబె  తర్వాత బుల్లెట్ రైలు సేవల ప్రాధాన్యతలో తమిళనాడుకు అవకాశం కల్పిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
 
 ప్రకటించినవి
 మదురై - జైపూర్ (వారాంతపు ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్),  చెన్నై - షాలిమార్ (ప్రీమియర్ ఏసీ ఎక్స్‌ప్రెస్),  చెన్నై - అహ్మదాబాద్ (వారంలో రెండు రోజులు), చెన్నై - విశాఖ (వారాంతపు రైలు), హోసూరు - యశ్వంత్ పూర్ రైలు. చెన్నై - హైదరాబాద్ (బుల్లెట్ రైలుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు ). వేలాంకన్ని, మేల్ మరువత్తుర్‌లకు ఉత్సవాల సమయంలో ప్రత్యేక రైళ్లను నడుపుతామన్న హామీని మాత్రం ఇచ్చారు.
 
 ఆశించినవి
 చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు కనీసం ఒక్క రైలైనా వస్తుందని ఆశించారు. విల్లుపురం - దిండుగల్ మధ్య రెండో మార్గం పనులకు, పళని - పొల్లాచ్చి మార్గం పనులకు, మదురై - కన్యాకుమారి రెండో మార్గం, మదురై - బోడి నాయకనూర్, తెన్‌కాశి - పునలూర్ మార్గాల పనులకు నిధులివ్వలేదు. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్‌లకు ప్రత్యామ్నాయంగా తాంబరం, రాయపురం స్టేషన్ల కొత్త టెర్మినల్ ప్రకటిస్తారని ఆశించినా జరగలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement