పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఎనిమిది మందిపై వేటు
కార్యకర్తల సమావేశంలో జేడీఎస్ అధిష్టానం నిర్ణయం
క్రాస్ ఓటింగ్ ఎమ్మెల్యేలపై కార్యకర్తల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
దిష్టి బొమ్మల దహనం = కార్యకర్తలను శాంతింపజేసిన దేవెగౌడ
ఆ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయాలని నేడు స్పీకర్‌కు ఫిర్యాదు
బెంగళూరు : రాజ్యసభ ఎన్నికలు జేడీఎస్ పార్టీలో చిచ్చురేపాయి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటాన్ని అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసిన ఎనిమిది మంది జేడీఎస్ పార్టీ శాసనసభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తూ జేడీఎస్ అధినాయకత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని దళం నాయకులు స్పీకర్ కాగోడు తిమ్మప్పను సోమవారం కోరనున్నట్లు సమాచారం. రాష్ట్ర శాసనసభ నుంచి శాసనమండలి, రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ అభ్యర్థులైన వెంకటపతి, ఫారూక్‌లు ఓటమి పొందిన విషయం తెలిసిందే. ఇందుకు జమీర్ అహ్మద్‌ఖాన్ నేతృత్వంలోని ఎనిమిది మంది శాసనసభ్యులు
క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడటమే కారణమని జేడీఎస్ అధినాయకులు భావించారు. దీంతో చామరాజపేట నియోజకవర్గ శాసనసభ్యుడు జమీర్ అహ్మద్‌ఖాన్‌తో పాటు చలువరాయస్వామి (నాగమంగల), హెచ్.సీ బాలకృష్ణ(మాగడి), గోపాలయ్య (మహాలక్ష్మీ లేఅవుట్), ఇక్బాల్ అన్సారి (గంగావతి), రమేష్ బండి సిద్దేగౌడ (శ్రీరంగపట్టణ), భీమానాయక్ (అగరిబొమ్మనహళ్లి), అఖండ శ్రీనివాస్ మూర్తి (పులకేశినగర)లను పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ జేడీఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో ఆదివారం జరిగిన జేడీఎస్ కార్యకర్తలు, పదాధికారుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి వై.ఎస్.వీ దత్త సస్పెన్షన్ తీర్మానాన్ని చదవి వినిపించారు.
కార్యకర్తల, అధినాయకుల ఆక్రోశం...
బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో ఆదివారం జేడీఎస్ పార్టీ కార్యకర్తల బహిరంగ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేక నినాదాలు చేశారు. వారి ఫెక్సీలను, దిష్టిబొమ్మలను తగుల బెట్టారు. వెంటనే ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ కలుగజేసుకుని వారిని శాంతింపజేశారు. మరికాసేపట్లో జరిగే పార్టీ పదాధికారుల సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ...‘జమీర్ అహ్మద్‌ఖాన్ తనకు ఉన్న ధనబలం వల్ల విర్రవీగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ డబ్బే అతన్ని గెలిపిస్తుందేమో చూస్తా. 2007 అక్టోబర్‌లోనే జమీర్ అహ్మద్‌ఖాన్, చలువరాయస్వామి, బాలకృష్ణలు కుమారస్వామికి విరుద్ధంగా కుతంత్రాలు పన్నారు. అప్పుడే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండాల్సింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇక వారు మన పార్టీ సభ్యులు కాదు.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ధైర్యముంటే శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జేడీఎస్ పార్టీకి రాజీనామ చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని బృహత్ సమావేశంలో పాల్గొన్న పార్టీ శాసనసభ్యుడు రేవణ్ణ సవాలు విసిరారు.