మోడీ సభకు గ్రీన్ సిగ్నల్
Published Wed, Feb 5 2014 12:14 AM | Last Updated on Fri, Mar 29 2019 6:00 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై శివార్లలోని వండలూరులో భారతీయ జనతా పార్టీ ఈనెల 8వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగసభపై స్టే విధించాలని కోరుతూ ఇటీవల దాఖలైన పిటిషన్‌ను మంగళవారం మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న దశలో ఈనెల 8వ తేదీన బీజేపీ ప్రచార సభకు ఏర్పాట్లు చేసుకుంటోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్ తది తర ప్రముఖులు హాజరుకానున్నారు. మోడీ ఇప్పటికే రాష్ట్రంలో రెండుసార్లు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా ఇది మూడోసారి. వండలూరులో వంద ఎకరాల స్థలాన్ని సభకు సిద్ధం చేశారు. సుమారు పది లక్షల మంది హాజరవుతారనే అంచనాతో 40 వేల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజాశ్రేయస్సు దృష్ట్యా మోడీ సభకు స్టే విధించాలని కోరుతూ విడుదలై చిరుతైగళ్ కట్చి ప్రచార కార్యదర్శి, న్యాయవాది గౌతంఖన్నా ఇటీవల మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని
దాఖలు చేశారు. గత ఏడాది పాట్నాలో జరిగిన మోడీసభలో బాంబు పేలిందని, చెన్నై శివార్లలోని వండలూరు సైతం జనంరద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ముందుజాగ్రత్త చర్యగా సభను అనుమతి మంజూరు చేయరాదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేష్‌కుమార్ అగర్వాల్, న్యాయమూర్తి కే రవిచంద్రబాబు ఈ పిటిషన్ ప్రజాప్రయోజనం కిందకు రాదని చెప్పారు. మనసులో ఏదోపెట్టుకుని కేవలం ప్రచారం కోసం పాల్పడిన చర్యగా తాము భావిస్తున్నామని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.
హైటెక్ ఆదరణ
హైటెక్ విధానాల ద్వారా మోడీకి ఆదరణ పెంచే ప్రయత్నాలను బీజేపీ చేపట్టింది. ఫేస్‌బుక్ వంటి సోషల్ నె ట్‌వర్క్‌లలో మోడీకి రోజు రోజుకూ విశేషాదరణ లభిస్తున్నట్లు పార్టీ రాష్ట్రశాఖ గుర్తించింది. ఏపార్టీకి చెందని 350 మంది యువజనులు సభకు హాజరై మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇలాంటి వారందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు మంగళవారం చెన్నైలో సభ నిర్వహించారు. సోషల్ నెట్‌వర్క్ ద్వారా బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, మోడీకి ఎలా ఆదరణ పెంచాలనే అంశాలను వారితో చర్చించారు. బీజేపీ ఐటీ విభాగం పేరుతో ఏర్పాటైన బృందానికి తమిళనాడుకు చెందిన పార్టీ జాతీయ కార్యదర్శి తమిళిసై సౌందరరాజన్, నిర్వాహణ కార్యదర్శి మోహన్‌రాజు, యువజన విభాగం అధినేత బాలగణపతి, కార్యదర్శి వినోద్‌లు దీనికి నాయకత్వం వహించారు.
ప్రత్యేక రైళ్లు
నరేంద్రమోడీ సభను విజయవంతం చేసేందుకు తాంబరం-చెంగల్పట్టు నడుమ పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ మంగళవారం ప్రకటించారు. గత ఏడాది తిరుచ్చిలో జరిగిన మోడీ సభకు రెట్టింపు సంఖ్యలో జనం హాజరు కావచ్చని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. వంద ఎకరాల్లో నిర్వహించే బీజేపీ సభ రాష్ట్రంలో నభూతో నభవిష్యత్‌గా ఉండబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా మోడీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన చెప్పారు. మోడీ సభలోగా రాష్ట్రంలో పొత్తులు ఒక కొలిక్కి రావచ్చనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Advertisement