షీనా బోరా కేసు దర్యాప్తులో కీలక పరిణామం
హత్య జరిగిన తీరేకాదు.. దర్యాప్తు జరుగుతున్న తీరులోనూ సంచలనాలు సృష్టిస్తోన్న షీనా బోరా కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు ప్రభుత్వం ఉన్నపళంగా పదోన్నతి కల్పించింది.
మారియాను హోం గార్డ్స్ డీజీగా నియమిస్తూ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భారీ ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్న నేపథ్యంలో మారియా బదిలీపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అవన్నీ ఊహాగానాలేనని, సాధారణ ప్రమోషన్లలో భాగంగానే మారియా డీజీగా నియమితులయ్యారని ముంబై పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదే విషయంపై మహారాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కేపీ బక్షి మాట్లాడుతూ.. రాకేశ్ మారియా బదిలీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న అహ్మద్ జావేద్ను ముంబై నగర నూతన కమిషనర్గా నియమించినట్లు, తక్షణమే ఈ నియమకాలు అమలులోకి రానున్నట్లు చెప్పారు. అయితే కొత్త కమిషనరే షీనా హత్య కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తారా? లేక ఏసీపీ స్థాయి అధికారులతోనే దర్యాప్తును ముగించేస్తారా? అనే విషయాలపై స్పష్టత రాలేదులేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.