ముస్లిమ్‌లకూ రిజర్వేషన్లు అమలు చేయాలి | Muslims want reservation, not Quran and computers: Owaisi | Sakshi
Sakshi News home page

ముస్లిమ్‌లకూ రిజర్వేషన్లు అమలు చేయాలి

Published Wed, Feb 4 2015 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

Muslims want reservation, not Quran and computers: Owaisi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ముస్లిమ్‌లకు రిజర్వేషన్లు అమలు చేయాలని, మైనారిటీలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మరాఠాలకు కల్పిస్తున్న రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే తమ పిల్లలు కూడా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకుంటున్నామని చెప్పారు.

ముస్లిమ్ ఆరక్షణ్ పరిషత్ బుధవారం సాయంత్రం కోండ్వాలోని కౌసర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన సభలో అసదుద్దీన్ ప్రసంగించారు. దేశంలో ముస్లిమ్‌ల జనాభా 11 శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉన్నతాధికారులుగా తమ మతానికి చెందిన వారు ఒక్కరు కూడా లేరని అన్నారు. రాష్ట్ర పోలీసు విభాగంలో ముస్లిమ్‌లకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. మరోవైపు తప్పుడు కేసుల్లో ఇరుక్కుని అనేక మంది ముస్లిమ్ యువకులు కొన్నేళ్లుగా మహారాష్ట్రలోని జైళ్లలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలులో ఉంటూ శరీర దారుఢ్యాన్ని (సిక్స్ ప్యాక్) పెంచుకుంటున్నాడని, తమ పిల్లలు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. ఏళ్ల తరబడి తాము కూడా బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడామని, ఈ దేశాన్ని ప్రేమిస్తున్నామని అన్నారు.
 ఇదిలా ఉండగా, మజ్లిస్ నేత బహిరంగసభపై పోలీసులు పలు నిషేధాజ్ఞలు విధించారు. అంతకుముందు పుణేలో అసదుద్దీన్ విలేకరులతో మాట్లాడుతుండగా, పోలీసులు ఒక నోటీసును అందచేశారు. వనవాడీ డివిజన్ ఏసీపీ రాజన్ భొగాలే సంతకం చేసిన ఆ నోటీసులో సభకు సంబంధించిన ఆంక్షలను వివరించారు.

మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని కోరారు. బహిరంగసభను లైవ్ టెలికాస్ట్ చేయకుండా పోలీసులు మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. ఈ షరతులకు అంగీకరిస్తూ ఒవైసీ ఆ నోటీసుపై సంతకం చేసినట్టు తెలిసింది. ఈ నోటీసులు, ఇలాంటి నిషేధాజ్ఞలు తనకు అలవాటేనని ఒవైసీ పేర్కొన్నారు. అయితే ఇది అనారోగ్యకరమైన ప్రజాస్వామ్య ప్రక్రియ అని విమర్శించారు.

పోలీసులు తన సభకు అనుమతినివ్వకపోతే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతానని చెప్పారు. ఇతర మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఒవైసీ సభ జరిగిన కౌసర్‌బాగ్ హాల్ వెలుపల శివసేన కార్యకర్తలు కొద్దిసేపు నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement