పుణే : సంఘ సంస్కర్త నరేంద్ర దభోల్కర్ హత్య జరిగిన నెల రోజులు గడుస్తున్నా నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫల మయ్యారు. ఇప్పటికీ నిందితుల వెదుకులాటలోనే పోలీస్ శాఖ ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల రోజుల్లో పోలీసులు ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. డజన్ల సంఖ్యలో అనుమానితులను ప్రశ్నించారు.. కాని ఇప్పటివరకు ఎటువంటి ఫలితాన్నీ రాబట్టలేకపోయారు. జర్నలిస్టు, సంఘ సేవకుడు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దభోల్కర్‌ను తెల్లవారుజామున వాకింగ్ వెళ్లి వస్తున్నప్పుడు పుణేలో అతడి ఇంటికి సమీపంలోనే ఆగస్టు 20వ తేదీన ఉదయం గం.7.30 ని.లకు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఈ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దుండగులు సుమారు నాలుగు బుల్లెట్లను పేల్చగా అందులో రెండు అతడి మెడ, వెనుక భాగంలో తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గర్లోనే ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయా డు. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ హత్యను ఖండిం చారు. నిందితులను పట్టిచ్చినా లేదా వారి సమాచారం తెలిపిన వారికి రూ.10 లక్షల బహుమానం ప్రకటించారు. అయితే నిందితులను గుర్తించడంలో పోలీసులు ముందడుగు వేయలేకపోయారు. సంఘటన జరిగిన అనంతరం రాష్ట్ర హోం మంత్రి ఆర్‌ఆర్ పాటిల్ మాట్లాడుతూ త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. దభోల్కర్ అంతిమ సంస్కారాలకు చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్. ఆర్‌ఆర్ పాటిల్ సహా పలువురు ప్రముఖులు హాజరై నివాళులర్పించిన విషయం తెలిసిందే. 1989లో దభోల్కర్ ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి(ఎంఏఎన్‌ఎస్)’ని స్థాపించి సమాజ ంలోని మూఢవిశ్వాసాలు, మంత్ర తంత్రాలు, బాబాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు. ప్రభుత్వం ‘మూఢవిశ్వాసాల వ్యతిరేక చట్టం’ను అతడి హత్య జరిగిన మరుసటి రోజే ఆమోదించింది. ‘నెలరోజులుగా దభోల్కర్ హత్య కేసు దర్యాప్తు జరుగుతున్నా ఇప్పటివరకు ఎటువంటి సాక్ష్యాలను పోలీసులు సంపాదించలేకపోవడం చూస్తుంటే ఇది ప్రభుత్వ ప్రేరేపిత హత్యగా కనిపిస్తోంది..’ అంటూ గురువారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని చెప్పవచ్చు. గురువారం తనను కలిసిన దభోల్కర్ కుమార్తె ముక్తా దభోల్కర్‌తో రాజ్ ఠాక్రే మాట్లాడుతూ మూఢవిశ్వాసాల వ్యతిరేక చట్టాన్ని ప్రభుత్వం ఇంతకుముందే ఆమోదించి ఉంటే దభోల్కర్ హత్య జరిగి ఉండేదని కాదని అభిప్రాయపడ్డారు.
సీఎం క్షమాపణ చెప్పాలి: బీజేపీ
దభోల్కర్ హత్యకుగురై నెలరోజులు గడుస్తున్నా ఎటువంటి ఆధారాలు సంపాదించకుండా సాగుతున్న దర్యాప్తుపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేసు విచారణ జరుపుతున్న పుణే క్రైం బ్రాంచి ఇప్పటికీ ఒక్క ఆధారాన్ని కూడా సంపాదించలేకపోయిందని, దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నేత వినోద్ తావ్డే డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఓ హత్య కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు సంపాదించలేకపోవడం సిగ్గుచేటైన వ్యవహారమని, ఇప్పటికైనా దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఎన్‌ఐఏ వంటిసంస్థలకు అప్పగించాలని తావ్డే డిమాండ్ చేశారు.
సా..గుతున్న దర్యాప్తు
Published Sat, Sep 21 2013 3:03 AM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM
Advertisement