తిరుచ్చి మురుక్కుపట్టిపాళెం సమీపంలో రైలు పట్టాలపై శుక్రవారం గుర్తు తెలియని శవం కనపడింది.
కేకేనగర్(చెన్నై): తిరుచ్చి మురుక్కుపట్టిపాళెం సమీపంలో రైలు పట్టాలపై శుక్రవారం గుర్తు తెలియని శవం కనపడింది. తిరుచ్చి రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి పంపారు. మృతుడి ప్యాంట్‌జేబులో ఉన్న ఓటర్‌ఐడీ ఆధారంగావిచారణ జరిపిన పోలీసులకు అతడు కన్యాకుమారి జిల్లా విలవన్‌కోడు తాలూకాకు చెందిన జగన్‌బాబు (31) అని తెలిసింది. పోలీసుల విచారణలో అతడు కొన్ని సంవత్సరాలుగా సింగపూరులో పనిచేసి గత జనవరిలో సొంత ఊరికి వచ్చినట్లు అదే ఊరికి చెందిన అజిత (25)ను జూన్‌లో 8వ తేదీ వివాహం చేసుకున్నట్టు తెలిసింది.
చెన్నైలో ఉద్యోగం చేస్తున్న అజితను చూడడానికి జగన్‌బాబు చెన్నైకు రైల్లో బయలుదేరినట్లు తెలిసింది. శుక్రవారం బోగీలో రద్దీ ఎక్కువగా ఉండడం వలన ఫుట్‌బోర్డుపై నిలబడి ఉన్న జగన్‌బాబు మురుక్కుపట్టి వద్ద కాలు జారి కింద పడి మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకుని అతని భార్య, బంధువులు తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి వచ్చి జగన్‌బాబు మృతదేహంపై పడి భోరున విలపించారు. వివాహం జరిగిన నెల రోజులకే జగన్‌బాబు మృతి చెందిన సంఘటన అతని కుటుంబంలో శోకాన్ని మిగిల్చింది.