మహోన్నత వ్యక్తి రజనీ | Rajinikanth towering Person says Sonaksi Sinha | Sakshi
Sakshi News home page

మహోన్నత వ్యక్తి రజనీ

Published Thu, Aug 7 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

మహోన్నత వ్యక్తి రజనీ

మహోన్నత వ్యక్తి రజనీ

 రజనీకాంత్ ప్రతిభను, ఆయన సాధనను, ఆయన అనితర సాధ్యస్థాయిని పొగడని వారుండరు. అయితే వాటికి హద్దులుంటాయి. కానీ బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మాత్రం అలాంటి హద్దులను మూటకట్టి అటకెక్కించి వీర లెవల్‌లో మన సూపర్‌స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా లింగా చిత్రంలో రజనీ సరసన నటిస్తున్నారు. ఈమెకు దక్షిణాదిలో మొదటి చిత్రం కూడా ఇదే. లింగా చిత్రంలో రజనీకాంత్‌తో నటిస్తున్న అనుభవం గురించి సోనాక్షి సిన్హా మాట్లాడుతూ,  జీవితంలో కొందరు మహోన్నత వ్యక్తులను కలుసుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయన్నారు.
 
 అలాంటి ఒక మార్పు లింగా చిత్రంలో రజనీకాంత్‌తో కలసి నటిస్తున్నప్పుడు తనలో కలిగిందని తెలిపారు. హిందీలో సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, సాహిత్ కపూర్ లాంటి ప్రముఖ హీరోలకు జంటగా నటించానని చెప్పారు. అప్పుడు తెలియని పలు విషయాలను, రజనీకాంత్‌తో నటిస్తున్నప్పుడు తెలుసుకున్నానని వివరించారు. రజనీ మహోన్నత వ్యక్తి అని, ఆయనో విశ్వవిద్యాలయం అని కూడా చెప్పవచ్చని పొగిడారు. ఇతరులకు తెలియని పలు విషయాల గురించి రజనీ తెలుసుకున్నారని, అసలు ఆయనకు తెలియదంటూ ఏమీ లేదని చెప్పారు. రజనీతో నటించిన ప్రతి రోజు ఎంతో విలువైందన్నారు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత  స్థాయికి చేరుకున్న గొప్ప వ్యక్తి రజనీ అన్నారు. ఆయన తన అనుభవాలను చాలా తనతో పంచుకున్నారని చెప్పారు.
 
 తద్వారా తనకు ఆధ్యాత్మికానికి సంబంధించిన భక్తి భావాన్ని కల్పించారని తెలిపారు. స్థూలకాయం ఆరోగ్యకరం కాదని చాలామంది చెప్పగా విన్నానన్నారు. అయితే రజనీ చెప్పిన విధం చాలా కొత్తగా ఉందన్నారు. ఆయన చెప్పింది వింటున్నప్పుడు దేహం ఒక దే వాలయంలా అనిపించిందని అన్నారు. కెమెరాముందు రజనీకాంత్ కెమెరా వెనుక రజనీకాంత్ వేర్వేరని చెప్పారు. రజనీ కారణంగా తాను చాలా మారిపోయానని సోనాక్షి సిన్హా అంటున్నారు. మొత్తానికి లింగా చిత్రం షూటింగ్‌లోనే రజనీకాంత్ గుణగణాలను అవపోసన పట్టేసినట్లుందని కోలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement