కొత్త ఎయిర్‌పోర్ట్‌కు సిద్ధం
Published Thu, Aug 29 2013 4:39 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైలో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని విమానయానశాఖ సహాయ మంత్రి వేణుగోపాల్ తెలిపారు. మీనంబాకం ఎయిర్‌పోర్ట్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణాలకు సంబంధించి స్థలం ఎంపిక బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించామని తెలిపారు. చెన్నైలో విమానాలు, ప్రయాణికుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా కొత్త ఎయిర్‌పోర్ట్ ఆవశ్యతను గతంలో గుర్తించి మంజూరు చేశామని తెలిపారు.
అయితే స్థలం ఎంపిక విషయంలో జాప్యం జరుగుతోందన్నారు. శ్రీపెరంబుదూరులో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినందున రాష్ట్రం స్థల సేకరణ, ఎంపిక పనులు చేపట్టిందని వివరించారు. స్థలాన్ని అప్పగించగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌ను ప్రయివేటు పరం చేసే విషయం కేంద్ర పరిశీలనలో ఉందన్నారు.
బాధ్యులపై చర్యలు
చెన్నై ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌ల టెర్మినల్స్ సీలింగ్ కూలిన సంఘటనలపై మంత్రి సీరియస్ అయ్యారు. మొత్తం రూ.2.516 కోట్ల వ్యయంతో రెండు టెర్మినల్స్ నిర్మించారు. వీటిని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఈ నాలుగు నెలల కాలంలో రెండుసార్లు సీలింగ్ పాక్షికంగా కూలింది. ఈ సంఘటనలపై విచారణ జరిపేందుకే తాను చెన్నై వచ్చినట్లు మంత్రి వేణుగోపాల్ మీడియాకు చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత కారకులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement