హీరో విశాల్‌పై క్రిమినల్ కేసు
చెన్నై: నడిగర్ సంఘం ఎన్నికలు చిలికి చిలికి గాలీవానగా మారాయి. పోటీపడుతున్న ప్రధాన జట్లు ఆగ్రహావేశాలను దాటిపోతుండగా, నటుడు శరత్‌కుమార్ హీరో విశాల్‌పై శుక్రవారం క్రిమినల్ కేసు దాఖలు చేశారు. తానూ కేసు పెట్టబోతున్నట్లు విశాల్ ప్రకటించారు.
దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఈనెల 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శరత్‌కుమార్, విశాల్ జట్లు ప్రధానంగా తలపడుతున్నాయి. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న శరత్‌కుమార్ జట్టుపై విశాల్ జట్టు గట్టి పోటీనే ఇస్తోంది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరువర్గాలు సాగిస్తున్న ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీస్తోంది. రెండు రోజుల క్రితం శరత్‌కుమార్ మద్దతుదారులు నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు శింబు చేసిన వ్యక్తిగతమైన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారం రేపాయి.
సామరస్య ధోరణిలో రాజీకి సిద్ధమంటూ శరత్‌కుమార్ జట్టు చేసిన ప్రకటనను విశాల్ జట్టు స్వీకరించలేదు. పోటీకి వెళ్లడం ఖాయమని తేల్చేశారు. ఇదిలా ఉండగా, ఎన్నికల తేదీ వెలువడిన నాటి నుంచి విశాల్ తనపై అవినీతి, అక్రమాలు అంటూ అనేక ఆరోపణలలో పరువునష్టం కలిగించాడని ఆరోపిస్తూ శరత్‌కుమార్ శుక్రవారం ఎగ్మూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ సమాచారం అందుకున్న విశాల్ తీవ్రంగా స్పందిస్తూ తాను కూడా త్వరలో శరత్‌కుమార్‌పై కేసును పెడతానని ప్రకటించారు.
కుటుంబాల్లో చిచ్చు
నడిగర్ సంఘం ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒకే కుటుంబంలోని సభ్యులు రెండు జట్లుగా విడిపోయారు. రెండు రోజుల క్రితం శరత్‌కుమార్ జట్టు నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు భాగ్యరాజ్ పాల్గొనగా, ఆయన కుమారుడు శంతను.. విశాల్ జట్టుకు చేరాడు. అలాగే దివంగత విలక్షణ నటుడు ఎస్‌ఎస్ రాజేంద్రన్ కుమారులు రాజేంద్రకుమార్, కలైవాసన్ శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలోనే సవాళ్లు విసురుకున్నారు.
తన తండ్రికి నిర్మించదలుచుకున్న మణిమండపం కోసం రెండు నెలలుగా ప్రయత్నిస్తున్నా నడిగర్ సంఘం స్పందించలేదని, ఇదే సమయంలో విశాల్ తనకు అండగా నిలిచి సహకరించాడని రాజేంద్రకుమార్ తెలిపారు. విశాల్ నేతృత్వంలో మధురై సమీపం చెట్టిపట్టిలో ఈనెల 12వ తేదీన తన తండ్రి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే పక్కనే ఉన్న కలైవాన్ తన సోదరుడి ప్రసంగాన్ని అడ్డుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, నడిగర్ సంఘం ఎన్నికల్లో నిర్మాతలు తలదూర్చరాదని ఆక్షేపిస్తూ ఏఎల్ అళగప్పన్ అనే నిర్మాత కలైపులి థానుపై విమర్శలు గుప్పించాడు. నడిగర్ సంఘం ఎన్నికలకు మరో ఎనిమిది రోజులు ఉండగా ఇంకా ఎన్నిమలుపులకు దారితీస్తోందని కోలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది.