దేశవ్యాప్తంగా స్థిరపడిన ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ప్రస్తుతమున్న చట్టాల్లో తగిన మార్పులు, చేర్పులూ చేపట్టేందుకు నిర్ణయించింది. కాగా, ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతకు సంబంధించి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్థిరపడిన ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ప్రస్తుతమున్న చట్టాల్లో తగిన మార్పులు, చేర్పులూ చేపట్టేందుకు నిర్ణయించింది. కాగా, ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతకు సంబంధించి అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన కమిటీ త్వరలో తన నివేదికను అందించనుంది. ఈ కమిటీ ముఖ్యంగా ఈశాన్యవాసులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న భద్రతపై చర్చించింది. అలాగే వీరిపై జరుగుతున్న దాడులు, దారుణాలకు గల కారణాలను అన్వేషించింది. వారి రక్షణకు ఆయా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఏర్పాటైన ఈ కమిటీకి కేంద్ర టూరిజం మాజీ సెక్రటరీ ఎం.పి.బెజ్ బారువా చైర్మన్‌గా వ్యవహరించారు. ‘కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాల ప్రజల కష్టనష్టాలపై అధ్యయనం చేశాం. అందులో మేం గమనించిన అన్ని విషయాలపై కేంద్ర మంత్రికి వివరించాం. మా పూర్తి నివేదికను జూలై మొదటివారంలో ప్రభుత్వానికి అందజేయనున్నాం.
అందులో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతపై కొన్ని సూచనలను చేశాం..’ అని మీడియాకు బారువా తెలిపారు. కాగా, ఈశాన్య ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం ప్రస్తుతం ఉన్న చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందా అని మీడియా ప్రశ్నించగా అవసరమైన చర్యల కోసం నివేదికలో పొందుపరిచామని వివరించారు. కమిటీ ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశమదేనని ఆయన స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వలసవస్తున్న వారి సమస్యలను పరిష్కరించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పినట్లు బెజ్‌బారువా పేర్కొన్నారు. ఈశాన్యవాసుల కట్టుబాట్లు, సంప్రదాయాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడం కష్టమవుతోందని వివరించారన్నారు. అయితే వారిపై జరిగే దాడులకు సంబంధించిన కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదుచేయని తమ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు వివరించారని బారువా వివరించారు.
ఇదిలా ఉండగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజూ మాట్లాడుతూ కమిటీ సభ్యులతో తాను మాట్లాడానన్నారు. దీనిపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ తగిన రీతిలో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే దేశంలో ఎక్కడా ఈశాన్య వాసులపై దాడులు జరగకుండా చూడాలని ప్రధానమంత్రి సూచించారని వివరించారు. కాగా, దేశంలోని వివిధ ప్రాంతాల కు వలస వెళ్లి స్థిరపడిన ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సంబంధించి వివిధ విషయాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. ముఖ్యంగా మహానగరాల్లో నివసిస్తున్న వారి సమస్యలపై పూర్తి అధ్యయనం చేయడమే కాక వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేసింది. కాగా, వివిధ వర్గాలకు చెందిన ఈశాన్యవాసులతో కలిసి వారు సమస్యలపై చర్చించేందుకు కమిటీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకు నిర్ణయించింది. ఢిల్లీలో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులే కాకుండా వివిధ రంగాల్లో స్థిరపడినవారితో భేటీ కానుంది. ఇందులో భాగంగా సోమవారం ఈ కమిటీ నాగాలాండ్ హౌస్‌లో మొదటి సమావేశాన్ని నిర్వహించింది. అలాగే ఈ కమిటీకి తమ సలహాలు, సూచనలు ఇద్దామనుకునేవారు ఈ-మెయిల్ చేయొచ్చని, లేదా ఎస్.సాహా, మెంబర్ సెక్రటరీ, హోం శాఖ కార్యకలాపాలు, రూమ్ నం.172-సి, నార్త్ బ్లాక్, న్యూఢిల్లీ-110001కు పోస్ట్ చేయవచ్చని సూచించింది.
తానియా హత్య కేసులో ఒకరికి బెయిల్
న్యూఢిల్లీ: గత జనవరిలో జరిగిన ఈశాన్య రాష్ట్ర విద్యార్థి నిడో తానియా హత్య కేసులోని నిందితుల్లో ఒకరికి సోమవారం ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితుడైన సన్నీ ఉప్పల్(37) పైనే కుటుంబపోషణ ఆధారపడి ఉందనే కారణంతో అతడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి రాజేందర్ కుమార్ శాస్త్రి తెలిపారు. అతడు బెయిల్ కాలంలో సాక్షులతో మాట్లాడేందుకు యత్నించకూడదనే షరతు విధించారు. కాగా, సన్నీ ఉప్పల్ ఢిల్లీ నివాసి అని, అతడు బెయిల్ సమయంలో కోర్టు పరిధి దాటి పారిపోడని నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టుకు హామీ ఇచ్చారు. లాజ్‌పత్‌నగర్ మార్కెట్‌లో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన నిడో తానియా తలకట్టును చూసి నింది తులు నవ్వడంతో అతడు గొడవపడ్డాడు. దాంతో వారు అతడిని చితకబాదారు. కాగా, మర్నాడు ఉదయం అనుమానాస్పద స్థితిలో తానియా మృతదేహం లభించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.