పింప్రి, న్యూస్‌లైన్: సముద్ర తీరాల వెంట ఛత్రపతి శివాజీ నిర్మించిన కోటలను మనం భద్రంగా కాపాడుకొని ఉంటే కసబ్ లాంటి ఉగ్రవాదులు మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారు కాదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్ఘాటించారు. నిర్వహణ లోపం కారణంగా ఆ కోటలు కనుమరుగైపోయాయని అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆయన జన్మస్థలమైన పుణే జిల్లా, జున్నర్ కోటపై ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఫడ్నవీస్‌తోపాటు గ్రామాభివృద్థి శాఖ మంత్రి పంకజా ముండే, పాలవే, పుణే జిల్లా ఇన్‌చార్జి మంత్రి గిరీష్ బాపట్, సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి దిలీప్ కాంబ్లే, జలవనరుల శాఖ సహాయ మంత్రి విజయ్ శివ్‌తారే, ఎంపీ ఉదయన్‌రాజే భోంస్లే, శిరూర్ ఎంపీ శివాజీరావ్ పాటిల్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రదీప్ కంద్, ఎమ్మెల్యే వినాయక్ మేటే, జున్నర్ ఎమ్మెల్యే శరద్ సోనవణే తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ వంశపారపర్యంగా వస్తున్న శివాజీ జయంతి వేడుకలు, ఆయన తల్లి జిజావు విగ్రహానికి జరిగిన అభివందన కార్యక్రమంలో ఫడ్నవీస్ పాల్గొన్నారు.
అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ కోటలను పరిరక్షించుకోవల్సిన అవసరం ఉందని, అందుకు ఖజానాపై ఎంత భారం పడినప్పటికీ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. శివాజీ హయాంలో కోటల కారణంగానే రాజ్య ప్రజలు క్షేమంగా, ధైర్యంగా ఉండేవారని గుర్తుచేశారు. ఖిల్లాల పరిరక్షణ, పునర్నిర్మాణం కోసం కేంద్రం సహకారంతో రాష్ట్ర స్థాయిలో ఒక సంస్థను స్థాపిస్తామని అన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ముంబైలోని అరేబియా సముద్రంలో భారీ శివాజీ స్మారకాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఎనిమిదేళ్ల నుంచి జరుగుతున్నాయి.
ప్రస్తుతం అన్ని శాఖల నుంచి అనుమతులు లభించాయని త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. శివాజీ దయవల్ల ఐదేళ్లలో రాష్ట్రం రూపురేఖలు మార్చివేస్తామని ఉద్ఘాటించారు. శివాజీ వంశంలో 13వ తరానికి చెందిన ఎంపీ ఉదయన్‌రాజే భోంస్లే మాట్లాడుతూ శివాజీ పేరు ఉచ్ఛరిస్తే చాలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని శరీరంలో ఒక విధమైన శక్తి వస్తుందని అన్నారు. నేటి యువకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అప్పుడే దేశం మరింత పటిష్టం అవుతుందన్నారు.
ఛత్రపతి శివాజీకి గవర్నర్ ఘన నివాళి
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గవర్నర్ సి.హెచ్.విద్యాసాగరరావ్ గురువారం శివాజీపార్క్ మైదానంలో అశ్వాన్ని అధిరోహించిన శివాజీ విగ్రహానికి భారీ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జీ మంత్రి సుభాష్ దేశాయ్, రవాణ శాఖ మంత్రి దివాకర్ రావుతే, ముంబై మేయర్ స్నేహల్ ఆంబేకర్, బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే తదితర ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం బీఎంసీ తరఫున మేయర్ బంగ్లాలో ఏర్పాటుచేసిన శివ్ జయంతి ఉత్సవాలకు కూడా గవర్నర్ హాజరయ్యారు. అక్కడ సంగీత కళా అకాడమి ఆధ్వరంలో జరిగిన దేశ భక్తి గీతాల ఆలాపన కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం ధారవికి చెందిన ఛత్రపతి శివాజీ విద్యాలయం ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రదర్శించిన జీజామాత, శివాజీ జీవిత చరిత్రపై నాటకాలను వీక్షించారు.
భివండీలో...
భివండీ, న్యూస్‌లైన్: ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గురువారం ఉదయం భివండీ మహానగర్ పాలిక ముఖ్య కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ తుషార్ చౌదరి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నజరానా సర్కిల్‌లో ఉన్న శివాజీ విగ్రహానికి కమిషనర్ జీవన్ సోనావునే, డీసీపీ సుదీర్ దాబాడే పూలమాల వేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సంతోష్ ఎం. శెట్టి, వికాస్ పాటిల్, కాలీద్ గుడ్డూతో పాటు కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
పుణే, పింప్రి-చించ్‌వడ్ నగరాలలో...
పింప్రి, న్యూస్‌లైన్: శివాజీ జయంతిని పురస్కరించుకుని పింప్రి-చించ్‌వడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగర మేయరు శకుంతలా ధరాడే, కమిషనరు రాజీవ్ జాదవ్, ఉప మేయరు ప్రభాకర్ వాఘర్ ఇతర అధికారులు శివాజీ విగ్రహానికి పుష్పహారాలు వేసి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. నగరంలో శివాజీ విగ్రహాలను అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ప్రతి రథం ముందు శివాజీ కోటలను, ఇతర చారిత్రాత్మిక కట్టడాల నమూనాలతో రథాలను అలంకరించారు.
హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో
సాక్షి, ముంబై: కింగ్‌సర్కిల్‌కు చెందిన ఆంధ్ర హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం దాదర్‌లోని చైత్యభూమి వద్ద శివాజీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంస్థ పదాధికారులు గుమ్మడి బొందయ్య శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సముద్రతీరం వెంట ఉన్న కోటలు, ఖిల్లాలు మన తెలుగు ప్రజలే కట్టారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు శశికాంత్ మేకల, సహాయ కార్యదర్శి తెడ్డుబాయి, భీంరావు మాదిగ, ఎంటీజాక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శివాజీ కోటలు లేనందునే ఉగ్రవాదుల చొరబాటు
Published Thu, Feb 19 2015 9:54 PM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement
Advertisement